Jagtial BRS MLA Sanjay Kumar | హైదరాబాద్: ప్రతిపక్ష BRS పార్టీకి మరో షాక్ తగిలింది. జగిత్యాల బీఆరెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కండువా కప్పి సంజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి BRS ను వీడి కాంగ్రెస్ లో చేరడం తెలిసిందే.


రాష్ట్రంలో కొనసాగుతున్న ఆపరేషన్ ఆకర్ష్ 
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ భావజాలంతో కలిసి పనిచేసే వారిని అందర్నీ కలుపుకుని వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు ఉండటంతో కొన్ని నెలలపాటు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ స్థానాలు నెగ్గడంపై ఫోకస్ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడంపై రేవంత్ దృష్టిసారించారు. ఈ క్రమంలో తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారంతో పాటు సీనియర్ నేత కుమారుడు భాస్కర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మూడో రోజుల కిందట పోచారం హస్తం పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నేతలు దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీలో పదవులు అనుభవించి, కష్టకాలంలో బీఆర్ఎస్ కు అండగా ఉండాల్సింది పోయి, ఈ వయసులో పార్టీ మారడం సిగ్గుచేటంటూ విమర్శించారు.

 


కేసీఆర్ మొదలుపెట్టిన పొలిటికల్.. ఇప్పుడిలా
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నారు కేసీఆర్. టీడీపీ మెజార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడంతో టీడీఎల్పీ విలీనం చేసినట్లు అయింది. 2014 ఎన్నికల తరువాత వైఎస్సార్ సీపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు సైతం కారు పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు భారీ మెజార్టీ వచ్చినా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి గులాబీ పార్టీలో చేరిపోయారు. గత ఏడాది నవంబర్ ఎన్నికల తరువాత కాంగ్రెస్  తొలిసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.  


తెల్లం వెంకట్రావు నుంచి సంజయ్ కుమార్ వరకు.. 
ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. మొదట తాను మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను కలిశానని చెప్పారు. ఆపై కాంగ్రెస్ నిర్వహించిన సభలోనూ కనిపించి కేసీఆర్ కు షాకిచ్చారు వెంకట్రావు. ఇంకా చెప్పాలంటే ఈ అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ కు షాకిస్తూ బీఆర్ఎస్ ను వీడిన తొలి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఆపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం హస్తం గూటికి వెళ్లారు.


లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలో చేరి టికెట్లు సైతం సాధించారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. బీఆర్ఎస్ వరంగల్ టికెట్ ఇచ్చినా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు కడియం శ్రీహరి, కడియం కావ్య. లోక్ సభ ఎన్నికల్లో కడియం కావ్య గెలుపొందారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకపోవడం కేసీఆర్ ను పునరాలోచనలో పడేసింది. ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి కీలక నేత బీఆర్ఎస్ ను వీడగా, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సైతం గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీకి వచ్చారు.