Andhra Pradesh Municipalities Act | అమరావతి: ఏపీ అసెంబ్లీ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారనున్నాయి. తాజాగా చేసిన చట్ట సవరణ ప్రకారం ఎంత మంది పిల్లలున్నా నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. జనాభా వృద్ధిరేటు పెంపులో భాగంగా ఏపీ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలకు నేడు శాసనసభలో ఆమోదం లభించింది. పంచాయతీ రాజ్ సహా పలు చట్టాలకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. మండలిలో ఈ బిల్లులకు ఆమోదం వచ్చాక, గవర్నర్ ఆమోదం పొందితే ఈ బిల్లులు చట్ట రూపం దాల్చనున్నాయి.  


దక్షిణాదికి చిక్కులు తెచ్చిన కుటుంబ నియంత్రణ!
జనాభా ప్రాతిపదికన త్వరలోనే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేయనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పే విషయాలను దక్షిణాది రాష్ట్రాలు, ప్రభుత్వాలు పాటించడం ద్వారా కుటుంబ నియంత్ర పాటించి జనాభా సమస్య అధికం కాకుండా చర్యలు తీసుకున్నాయి. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం కుటుంబ నియంత్రణ చర్యలను అక్కడి ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయకపోవడంతో వారి జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు ఎక్కువగా పెరగనున్నాయి. ఇప్పటికే దక్షిణాదిపై ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం ఉందని, వారి సీట్ల సంఖ్యలో సభలో దక్షిణాది వారి అభిప్రాయాలకు విలువ మరింత తగ్గుతుందని రాజకీయంగా చర్చ జరుగుతోంది.


ఇటీవల దక్షిణాదిని ఊపేసిన స్టాలిన్, చంద్రబాబు కామెంట్లు..
ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు గత నెలలో చేసిన వ్యాఖ్యలు దక్షిణాదిన హాట్ టాపిక్ అయ్యాయి. కొత్తగా పెళ్లైన దంపతులు 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదు అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు ఆ మాటలు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కవ మంది పిల్లల్ని కనాలని ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ వారి రాష్ట్రాల ప్రజలకు సూచించడం వెనుక పెద్ద కారణమే ఉంది. 



గతంలో కొన్ని దశాబ్దాలపాటు ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు అసలే వద్దు అని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. కానీ దీన్ని దక్షిణాది రాష్ట్రాలు కాస్తో కూస్తో అమలు చేయగా ఇక్కడ జనాభా మరీ ఉత్తరాది రాష్ట్రాల్లా విపరీతంగా పెరగలేదు. ఈ సీఎంల మాటల వెనక పెద్ద కారణాలే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి తగ్గిపోయిందని, జీవిస్తున్న ప్రజల సరాసరి వయసు పెరిగిపోతుందని నాబార్డ్ లెక్కలు చెబుతున్నాయి. కుటంబంలో జాతీయ సగటు 4.3గా ఉంటే.. ఉత్తరాదిలో ఇది 5 ఉంది. కేరళలో 3.8, ఏపీలో 3.7, తమిళనాడులో 4.1, కర్ణాటకలో 4.3 గా సగటు ఉంది. కుటంబాలు చిన్నవి కావడంతో దక్షిణాదిన వృద్ధుల సంఖ్య (60 ఏళ్లు దాటిన) వారి సంఖ్య పెరుగుతోంది. 19 నుంచి 60 మధ్య వారి సంఖ్య తగ్గితే పనిచేసే వారి సంఖ్య తగ్గినట్లే. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో యువత అధికంగా ఉండాలంటే జనాభా పెరగాలని చంద్రబాబు, స్టాలిన్ సూచించారు.


Also Read: TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు


సంతానం ఎక్కువ ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని భయాలు వద్దని, చట్టంలో సవరణ చేస్తామని చంద్రబాబు ఇటీవల చెప్పారు. తాజాగా ఏపీ శాసనసభలో ఏపీ పంచాయతీ రాజ్, ఏపీ మున్సిపాలిటీ సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. ప్రస్తుతం చైనా, జపాన్ లాంటి దేశాల్లో పెళ్లిళ్లపై ఆసక్తి చూపకపోవడంతో యువత సంఖ్య తగ్గిపోయి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య జనాభాలో భారీగా కనిపిస్తోంది. అంటే పనిచేసే వారి సంఖ్య తగ్గి వారు ఎదుర్కొంటున్న సమస్య రావద్దంటే జనాభా పెరగాలని, యువత శాతం పెరుగుతుందని దక్షిణాది నేతలు స్టాలిన్, చంద్రబాబు లాంటి నేతలు భావిస్తున్నారు.