Lagacharla Issue In Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నియోజకవర్గం కొడంగల్(Kodangal)లోని లగచర్ల దాడి ఘటన కేసు మరింత తీవ్రం అవుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఏ 1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ 2గా ఉన్న సురేష్ మాత్రం ఇంత వరకు ఆచూకీ లేదు. అందుకే అతని వెతికి పట్టుకునేందుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశారు. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నప్పటికీ ఇంత వరకు సురేష్(Suresh) ఆచూకీ లభించకపోవడంపై పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్(Hyderabad) చుట్టుపక్కలే ఆయన్ని దాచి పెట్టి ఉన్నారని ఫోన్ సిగ్నల్‌కి కూడా దొరకడం లేదని అంటున్నారు. అందుకే ఈ వ్యక్తిని పట్టుకోవడం మంరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇవాళ లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.
ప్రభుత్వంపై లగచర్ల బాధితులు ఫిర్యాదులు
లగచర్లలో ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్(BRS)... కొందరు రైతులను ఢిల్లీ తీసుకెళ్లింది. అక్కడ జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, షెడ్యూల్ తెగల, షెడ్యూల్ కులాల కమిషన్ అధికారులతో సమావేశమవుతున్నారు. ప్రభుతాన్ని, అధికారులను కట్టడి చేయాలని ఫిర్యాదులు చేయిస్తున్నారు.
ఈ ఫిర్యాదులు అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్‌ఎస్ నేతలు, లగచర్ల రైతులు తమ భూములు ఇచ్చేది లేదంటూ గత 9 నెలలుగా చాలా ధర్నాలు చేస్తున్నామన్నారు. ధర్నాలు చేసినప్పుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ సహా ఏ అధికారి రాలేదని వివరించారు. మొన్న మాత్రం కలెక్టర్ సాధారణ దుస్తుల్లో పోలీసు సెక్యురిటీ లేకుండా వచ్చారని తెలిపారు. ఆయన కలెక్టర్ అని తెలియకుండానే కొంతమంది పిల్లలు తెలియకుండా దాడి చేశారని అంగీకరించారు.
తెలియకుండా దాడి చేశాం: బాధితులు
తెలియకుండా జరిగిన దాడిని చూపించి అర్థరాత్రి 500 మంది పోలీసులు తమ ఇళ్లపైకి దౌర్జన్యానికి వచ్చారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కరెంట్ తీసేసి ఇంట్లోకి వచ్చి కొట్టారని బూతులు తిట్టారని తెలిపారు. అదే రోజు చాలా మంది మగవాళ్లను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. పోలీసులు చేస్తున్న దౌర్జన్యానికి భయపడి చాలా మంది ఊరి వదిలి పారిపోయారని వివరించారు.
ప్రాణాలు పోయిన భూములు ఇవ్వబోం: బాధితులు
భూములు ఇవ్వబోమని చెబుతున్నా వదలడం లేదని అన్నారు బాధితులు. తమ భూములు మొత్తం తీసుకుంటే బతికేది ఎలా అంటూ ప్రశ్నించారు. ఎప్పుడు పోలీసులు వచ్చి ఏం చేస్తారోనని ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందన్నారు. ఇంట్లో ఉన్న మగవాళ్లందరినీ తీసుకెళ్లారని... ఎనిమిది రోజులుగా పిల్లలు ఎక్కడున్నారో తెలియదని వాపోయారు. 9 నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామన్నారు. ప్రాణాలు పోయినా సరే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమన్నారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్తే బెదిరించి పంపించారని తెలిపారు.
Also Read: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్