Anna Canteens: అన్న క్యాంటీన్లకు పసుపు రంగు వేయడంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో కూడా ఇలాంటి రచ్చే జరిగింది. అప్పట్లో గ్రామ, వార్డు సచివాలయాలకు వైసీపీ రంగులు వేశారంటూ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కోర్టుకెక్కింది. చివరకు అనుకున్నది సాధించింది. ఇప్పుడు అన్న క్యాంటీన్ల వ్యవహారం తేలాల్సి ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి వచ్చాక మూసివేసింది. వాటిని ఇతర అవసరాలకు వాడుకుంది. కొన్ని భవనాలను సచివాలయాలుగా మార్చింది, మరికొన్ని పాడుబడిపోయాయి. కూటమి వచ్చిన తర్వాత వాటన్నిటినీ తిరిగి ప్రారంభిస్తోంది. తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభించారు. మలి విడతలో ఈనెల 18న 75 క్యాంటీన్లు ప్రారంభించారు. మొత్తంగా రాష్ట్రంలో 175 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. అన్నిటినీ ఒకే తరహాలో ఏర్పాటు చేశారు.
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు ఫొటోలు కామన్ గా ఉంటాయి. ఇక రంగుల విషయానికొస్తే.. ఎరుపు, పసుపు కాంబినేషన్ హైలైట్ అవుతుంటుంది. పసుపు బోర్డ్ పై రెడ్ కలర్ అక్షరాల్లో అన్న క్యాంటీన్ అనే పేరుంటుంది. ఇక్కడ డిప్యూటీ సీఎంకి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కొంతమంది ప్రస్తావించినా జనసేన ఆ విషయంలో రియాక్ట్ కాలేదు. పవన్ కల్యాణ్ కూడా ఎక్కడా టీడీపీకి ప్రాధాన్యత దక్కిందని అనలేదు. సో అన్న క్యాంటీన్ విషయంలో కూటమి వరకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అయితే వైసీపీ నుంచి మాత్రం తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అన్న క్యాంటీన్లలో సౌకర్యాలు సరిగా లేవని, ప్లేట్లు సరికా కడగడం లేదని ఆ మధ్య కొన్ని వీడియోలను వైసీపీ వైరల్ చేసింది. అయితే అదంతా తప్పుడు ప్రచారమని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. అక్కడితో ఆ వ్యవహారం ముగిసిందనుకున్నా ఇప్పుడు కొత్తగా అన్న క్యాంటీన్ల రంగు గురించి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
అన్న క్యాంటీన్లకు తెలుగుదేశం పార్టీని గుర్తు తెచ్చేలా పసుపు రంగు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేస్తుంటే అధికారులు వారించలేదని సైతం ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేయడం సరికాదంటూ గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఏపీలో పరిణామాలున్నాయన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఈ పిటిషన్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో రాజకీయ చర్చకు తెరతీసింది. ఈ పిటిషన్ వెనక వైసీపీ హస్తముందనే అనుమానాలున్నాయి.
మరోవైపు వైసీపీ కూడా అన్న క్యాంటీన్లపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తామన్న అన్న క్యాంటీన్లకోసం విరాళాలు సేకరిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిధులివ్వకుండా విరాళాలతో క్యాంటీన్లు నిర్వహించడమేంటని లాజిక్ తీస్తున్నారు.
Also Read: డాక్టర్‌ని కొట్టిన జనసేన ఎమ్మెల్యే! బూతులతో మెడికల్ కాలేజీ వైస్ ఛైర్మన్‌పై దాడి
క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణ విషయంలో వైసీపీ వాదనను ప్రజలు పట్టించుకుంటారా లేదా అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. వైసీపీ హయాంలో అన్న క్యాంటీన్లు లేవు. కూటమి ప్రభుత్వం వీటిని పునరుద్ధరించింది. సో క్యాంటీన్ల విషయంలో టీడీపీపై ప్రజల్లో సింపతీ ఉందనేది ఆ పార్టీ నేతల వాదన. క్యాంటీన్లు పూర్తిగా లేకుండా చేసిన వైసీపీ, ఇప్పుడు వాటి నిర్వహణ సరిగా లేదని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని అంటున్నారు టీడీపీ నేతలు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. భోజనం నాణ్యత గురించి కాకుండా, క్యాంటీన్ల రంగు హైలైట్ కావడం, దానిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ఇక్కడ విశేషం.