AP New Cabinet : ఏపీ కొత్త కేబినెట్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్‌ 11వ తేదీ ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత గవర్నర్‌ బిశ్వ భూషణ్, సీఎం జగన్‌తో కలిసి పాత, కొత్త మంత్రులు తేనీటి విందులో పాల్గొంటారు. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై సీఎం జగన్ ఇప్పటికే గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ని కలిసి చర్చించారు. 



నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం ఇక్కడే


ఏప్రిల్ 11వ తేదీన జరిగే మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై సీఎఎస్ సమీర్ శర్మ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర సచివాయలం పక్కనే నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రివర్గ సభ్యులు గ్రూపు ఫొటో దిగనున్నారు. 


Also Read : రాష్ట్రమంతా వాలంటీర్లకు అవార్డులు, ప్రశంసలు - నెల్లూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్


కరకట్ట రోడ్డులో ప్రముఖులకు ఎంట్రీ 


నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదిక, అలంకరణ, ఆహ్వాన పత్రిక, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులుగా డిజిగ్నేట్ అయిన వారికి ఆహ్వానం ఏర్పాట్లు, రవాణా సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రోటోకాల్ డైరెక్టర్ కు సహకరించే విధంగా కొంతమంది ప్రోటోకాల్ అధికారులను ప్రభుత్వం నియమించింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని 11వ తేదీన కరకట్ట రోడ్డులో గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు, మంత్రులుగా నియమించబడిన వారికి, ఎంపీలు, ఎమ్ఎల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖుల వాహనాలు ప్రమాణ స్వీకార ప్రాంతానికి చేరుకునేలా ఏర్పాటుచేస్తున్నారు. మిగతా వారి వాహనాలు ఇతర మార్గాల్లో వచ్చేలా తగిన ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.  


Also Read : AP Cabinet : కొత్త కేబినెట్‌కు తుది రూపు - ఏ క్షణమైనా గవర్నర్‌కు జాబితా !