Nellore News : నెల్లూరు జిల్లా విభజనతో అధికారులు, సిబ్బంది విభజన జరిగింది. రెవెన్యూ విభాగంలో అధికారుల విభజన బాగానే జరిగినా, పోలీసు విభాగంలో మాత్రం తమకు అన్యాయం జరిగిందని ఏఆర్ కానిస్టేబుళ్లు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. నెల్లూరులోనే పుట్టాం, నెల్లూరులోనే పెరిగాం.. ఇప్పుడు కొత్తగా వేరే జిల్లాకు వెళ్లాలని హుకుం జారీ చేస్తే పోయేది లేదని అంటున్నారు. కానిస్టేబుల్ నాగేశ్వరరావు కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు అన్యాయం జరిగిందని, వాలంట్రీ రిటైర్మెంట్ ఇచ్చేందుకు సైతం తాను వెనకాడనని చెప్పారు. తాను బాపట్లకు చెందినవాడినని, అలాంటిది తిరుపతి జిల్లాకు ఎలా వేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనలో తన సొంత జిల్లాకు పంపించినా పర్లేదని, కానీ తిరుపతికి వేయడం సరికాదని అన్నారు. డబ్బులు తీసుకుని బదిలీలు జరిగాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. 



(ఏఆర్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు)


డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు 


"డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిన లిస్ట్ ప్రకారం కాకుండా కొందరు అధికారులు వాళ్ల ఇష్టం వచ్చినట్లు ట్రాన్స్ ఫర్స్ చేశారు. ఈ విషయం ఎస్పీ గారికి కూడా తెలియదు. బదిలీలు ఎస్పీ, డీపీవోలు చేస్తే వివాదం లేకపోను. కానీ ఏఆర్ సిబ్బంది, అడ్మిన్ మేడమ్ కలిసి వాళ్లకు నచ్చిన వాళ్లను, వాళ్ల ఇంట్లో పనిచేసిన వాళ్లను ఉంచుకుని మాలాంటి వాళ్లను వేరే జిల్లాలకు బదిలీలు చేశారు. ఇందులో చాలా అక్రమాలు జరిగాయి. జూనియర్లు బదిలీ చేయకుండా 26 ఏళ్ల సర్వీస్ ఉన్న నన్ను ఎక్కడో తిరుపతి జిల్లాకు బదిలీ చేస్తున్నారు. నా లాగా చాలా సీనియర్స్ ను బదిలీ చేశారు. ఆఫీసర్లు ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు, గన్ మెన్స్ పేర్లు లిస్ట్ లోంచి తీసివేసి మా లాంటి వాళ్ల పేర్లు లిస్ట్ పెట్టారు. డబ్బులు తీసుకుని ట్రాన్స్ ఫర్స్ చేశారని కొందరు అంటున్నారు. నన్ను డిస్ మిస్ చేసినా సరే ఎస్పీ గారికి ఈ విషయం తెలియాలని మీడియా ముందుకు రావాల్సి వచ్చింది" అని ఏఆర్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు అన్నారు. 


పిల్లల చదువులు ఏం కావాలి 


"మా ఏఆర్ స్టాఫ్ మొత్తానికి తెలుసు మోసం జరిగిందని, ఎస్పీ గారికి  ఈ విషయం తెలుసు. ఎస్పీ గారు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎస్పీతో మాట్లాడించండి అని అడిగితే మాపై అధికారులు ఒప్పుకోవడంలేదు. నాది బాపట్ల నన్ను అక్కడికి పంపిస్తే వెళ్లిపోతాను. మా పిల్లలు చదువు ఏం కావాలి ఎక్కడో తిరుపతి వేస్తే. సీనియారిటీ లిస్ట్ తీసి దాని ప్రకారం బదిలీలు చేయండి" అని నాగేశ్వరరావు ఆవేదన చెందారు.