గిట్టుబాటు ధర కంటే అధిక ఆదాయం పొందాలంటే సేంద్రియ వ్యవసాయ పంటల సాగు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పురుగుమందుల అవశేషాలు లేని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ లో మంచి గిరాకీ ఉందని ఆయన తెలిపారు.


తక్కువ పెట్టుబడి... అధిక ఆదాయం...
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం చేకూర్చటమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అవకాశాలను పెంపొందించేందుకు రైతులు, ఎగుమతిదారులతో ప్రత్యేక వర్క్ షాప్ ను విజయవాడలో నిర్వహించారు. వర్క్ షాపును  జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రమని, మన రాష్ట్రం నుంచి దేశంలోనే అధిక స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతున్నాయని, ఇవి మరింత ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.


రైతులకు గిట్టుబాటు ధర కంటే ఎక్కువ ధర వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చెందుకు ఎగుమతిదారులు ముందుకు రావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రైతన్నకు అధిక లబ్ధి చేకూర్చాలని నిరంతరం తపన పడుతున్నారని, రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, యంత్రసేవా పథకం, ఆర్ బీ కేల ఏర్పాటు ఇలా విత్తనం నుండి విక్రయం వరకు రైతన్నలకు అండగా ప్రభుత్వం ప్రతి దశలోనూ నిలుస్తుందన్నారు. ఇందులో భాగంగానే మార్కెట్ యార్డ్ లను బలోపేతం చేయటానికి ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


ఎగుమతి కష్టాలు తీరుస్తాం...
ఎగుమతుల్లో రైతులు ఎదుర్కోంటున్న ఇబ్బందులను గమనించి వారికి అండగా నిలవటానికి రైతులు, ఎఫ్ పీ వో, అధికారులు, ఎక్స్‌పోర్టర్స్ లతో వర్క్ షాపులు నిర్వహించి నిర్వహణ ఇబ్బందులకు చెక్ పెట్టి రైతులకు మేలు చేకూర్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులకు, ప్రభుత్వానికి మద్య దళారులు లేకుండా నేరుగా డిబీటీ పద్దతిలో లబ్ధిదారులు, రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్న ఎకైక రాష్ట్రం మన రాష్ట్రమేనన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం మన రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులను గమనించి వారి రాష్ట్రాల్లో అమలు చేయటానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని అన్నారు. మన రాష్ట్రం నుంచి వ్యవసాయ, అనుబంధ, ఉధ్యానవన ఉత్పత్తులను 100 దేశాలకు ఎగుమతులు చేస్తున్నామని, వచ్చే ఏడాదికి ఎగుమతులు రెండింతలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకు రైతులకు అందుబాటులో నిత్యం ఉండి వారిని ప్రోత్సహించేందుకు ఎఫ్ పీ వో లు పనిచేస్తాయని చెప్పారు. 


రైతుల్లో భరోసా కల్పిస్తాం...
వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. రైతులకు ఎగుమతిదారులకు మధ్య ప్రభుత్వం సమన్వయకర్తగా పనిచేసి రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ వారికి అధిక ధర లభించేలా కృషి చేస్తుందన్నారు.  రైతుల్లో భరోసా కల్పించి, రైతులు అధిక లాభాలు సాధించటానికి అధికార బృంధం యాక్సన్ ప్లాన్ రూపొందించి పటిష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు.  ఎక్స్ పోర్ట్స్ లో రైతుల సమస్యలకు చెక్ పెట్టడానికి “ఇంటిగ్రేటెడ్ ఎక్స్ పోర్ట్ పార్క్” ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.


ప్రాసెసింగ్ యూనిట్లు మన రాష్ట్రంలో ఎక్కువగా ఏర్పాటు చేయటానికి వ్యాపారులను ప్రోత్సహించాలని, అలాగే ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు ప్రతి ప్రాంతంలోనూ అందుబాటులోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర కంటే అధిక లాభాలు సాధిస్తారని తెలిపారు.  రైతులు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల కంటే ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడే అధిక లాభాలు సాధించగలరన్నారు. నాణ్యమైన పంట ఉత్పత్తుల సాగుకు అవసరమైన సహకారం అధికారుల నుంచి అందుతుందని, రైతులు వారి సలహాలు, సూచనలతో అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులను సాధించగలరన్నారు.