Viral News: ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, సామాజిక కార్యకర్తలకు ప్రజలు లేఖలు రాస్తుంటారు. తమ ప్రాంతంలో, గ్రామంలో, ఊర్లో, ఇతర సమస్యలు పరిష్కరించాలంటూ లేఖలు రాసి కోరుతుంటారు. తాజాగా రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి కూడా అలాగే తమ సమస్యను వివరిస్తూ, దానిని పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఆఫీస్ కు లెటర్ రాశాడు. ఆ లేఖను చూసిన అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఆ లెటర్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది ఆ పోస్టుపై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అంతగా ఆ లేఖలో ఏముంది, అతగాడు ఏం రాశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్ సిక్రాయ్ సబ్ డివిజన్ లోని గంగాద్వాడి గ్రామానికి చెందిన కల్లు మహ్వర్ అనే వ్యక్తి ఆ లేఖ రాశాడు. అతనో పెళ్లి కాని ప్రసాదు. మహ్వర్ వయస్సు 40 ఏళ్లు దాటాయి. ఇప్పుడదే తన ఆందోళన అంతా. 40 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాకపోవడంతో ఓ అమ్మాయిని చూసి తనకు పెళ్లి జరిపించి పుణ్యం కట్టుకోవాలంటూ ఏకంగా సీఎం ఆఫీస్ కే లేఖ రాశాడు కల్లు మహ్వర్. రాజస్థాన్ లోని దౌసా జిల్లా బహరవాండా బ్లాక్ లోని ద్రవ్యోల్బణ సహాయ శిబిరంలో శనివారం ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ సీఎం సహాయ శిబిరాలని సిక్రాయ్ సబ్ డివిజన్ లోని గంగాద్వాడి గ్రామం నుంచి ఈ లేఖ వచ్చింది. ఇంటి సమస్యలతో, నెరవేర్చాల్సిన బాధ్యతలతో తనకు చూస్తుండగానే 40 ఏళ్లు వచ్చేశాయని, ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని, ఇప్పటికైనా తనకు పెళ్లి జరిపించాలని ఆ లేఖలో వేడుకున్నాడు కల్లు మహ్వర్. తనను ఓ ఇంటి వాడిని చేయాలని కోరుకున్నాడు.
'అమ్మాయి సన్నగా ఉండాలి, నాయకత్వ లక్షణాలుండాలి'
ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని, ఇంటి పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నానని మహ్వర్ తన లేఖలో పేర్కొన్నాడు. తనకో అమ్మాయిని వెతికి పెడితే పెళ్లి చేసుకుని స్థిరపడతానని కోరాడు. అంతే కాదు, తనకు కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా తన లేఖలో పేర్కొన్నాడు. తనకు కాబోయే భార్య తప్పనిసరిగా సన్నగా ఉండాలని, నాయకత్వ లక్షణాలు ఉండాలని.. న్యాయంగా వ్యవహరించడంతో పాటు అమ్మాయి వయస్సు 30 - 40 ఏళ్ల మధ్యే ఉండాలని లేఖలో కోరాడు. వీలైనంత త్వరగా తన ఇంటికి ఓ ఇల్లాలిని అందించాలని మహ్వర్ విజ్ఞప్తి చేశాడు.
'అమ్మాయిని వెతికే పనిలో అధికారులు'
పెళ్లి జరిపించాలంటూ మహ్వర్ లేఖ రాయడమే వింత అంటే.. ఆ లేఖపై స్థానిక అధికారులు వ్యవహరించిన తీరు మరింతగా షాకింగ్ గా ఉంది. పెళ్లి చేయించాలంటూ మహ్వర్ రాసిన లేఖ కాస్త సహాయక శిబిరంలోని తహశీల్దార్ హరికిషన్ సైనీ వద్దకు వెళ్లింది. దీంతో మహ్వర్ కు తగిన జీవిత భాగస్వామిని చూసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించాలని స్థానిక పట్వారీకి దరఖాస్తును ఫార్వార్డ్ చేశాడు తహశీల్దార్. తహశీల్దార్ చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.