ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్ కర్నూల్ పర్యటనలో ఉన్నారు. నాగర్ కర్నూల్ పట్టణంలో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం సహా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం (జూన్ 6) ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి నమస్కరించారు. రూ.52 కోట్లతో జిల్లా కలెక్టరేట్ నిర్మించగా, రూ.35 కోట్లతో పోలీసు భవన సముదాయాలు నిర్మించారు. ఈ ప్రారంభోత్సవాల తర్వాత వెలమ ఫంక్షన్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఆ సభలోనే ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.