ఏపీ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండె పోటుతో మరణించారు. ఆయన మరణంపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై మేకపాటి కుటుంబం స్పందించింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్ లో యథావిధిగా గడిపి రాత్రి 9.45 కల్లా మంత్రి ఇంటికి చేరారన్నారు. 


సోమవారం ఉదయం అసలేం జరిగిందంటే? 



  • 06.00 గం.లకు రోజూలాగే ఉదయాన్నే మేల్కొన్న మంత్రి

  • 06:30 గం.ల వరకూ మంత్రి ఫోన్ తో కాలక్షేపం

  • 07.00 గం.లకు మంత్రి నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చుని ఉన్న మంత్రి మేకపాటి

  • 07:12కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పిన మంత్రి గౌతమ్ రెడ్డి

  • 07:15 గం.లకు హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి కిందకి ఒరిగిన మంత్రి

  • 7:16 గం.లకు కంగారు పడి గట్టిగా అరిచిన మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి

  • 07:18 మంత్రి ఛాతిమీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించిన మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావు

  • 07:20 మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో మంత్రి, వ్యక్తిగత సిబ్బందిని పిలిచిన గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తి

  • 07:22 "నొప్పి పెడుతుంది కీర్తి" అన్న మంత్రి మాటలకు స్పందించి వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరిన మంత్రి సిబ్బంది

  • 07:27 మంత్రి ఇంటి నుంచి 3 కి.మీ దూరంలో అపోలో ఆస్పత్రికి 5 నిమిషాల్లో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి చేర్చిన మంత్రి మేకపాటి డ్రైవర్,సిబ్బంది 

  • 08:15 గం.లకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని తెలిపిన అపోలో వైద్యులు

  • 09:13 గం.లకు మంత్రి మేకపాటి ఇక లేరని నిర్ధారించిన అపోలో ఆస్పత్రి వైద్యులు

  • 09:15 గం.లకు మంత్రి మేకపాటి చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించిన అపోలో వైద్యులు 


స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు


మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరిపించనుంది. ఎల్లుండి (ఫిబ్రవరి 23) మేకపాటి అంత్యక్రియలను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం బ్రాహ్మణపల్లిలో నిర్వహిస్తారు. ఈ మేరకు బుధవారం (ఫిబ్రవరి 22) ఉదయం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరుకు తీసుకువెళ్లనున్నారు. నేడు సాయంత్రం వరకూ అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న గౌతమ్‍ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి బయలుదేరినట్లు తెలుస్తోంది. ఆయన రేపటికి స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి, ఎల్లుండి మేకపాటి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. మేకపాటి హఠాన్మరణం నేపథ్యంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.