ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutham Reddy) గుండెపోటుతో మరణించారు. ఆయన అకాల మరణంతో ఏపీ(AP)లో విషాదం నెలకొంది. మంత్రులు, వైసీపీ శ్రేణులు మేకపాటికి నివాళులు అర్పిస్తున్నారు. సొంత అన్నను కోల్పోయినట్లు ఉందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) అన్నారు. ఆయన స్వచ్ఛమైన రాజకీయాలు చేశారని, ఎక్కడా వివాదాలు లేవన్నారు. ఎప్పుడూ నవ్వుతూనే ఉండే వ్యక్తి అన్నారు.
'నెల్లూరు జిల్లాలోని సమస్యలపై కొద్దీ రోజుల క్రితమే డిస్కస్ చేశాం. ఆయన మరణం పార్టీకి, మా జిల్లాకి తీరని లోటు. రేపు నెల్లూరులో పార్టీ నాయకులు చివరి చూపు చూడటానికి అక్కడ పార్థివ దేహాన్ని ఉంచుతాం. మేమిద్దరం ఫిట్ గా ఉంటామని అనేవారు.
వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు
వైఎస్ఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే వారు మేకపాటి గౌతమ్ రెడ్డి అని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులన్నారు. ఈ రోజు ఆయన ఇకలేరనే విషయం నమ్మశక్యంగా లేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) మాట అంటే ఆయనకి శిరో దార్యం అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి లేరు అనే వార్త నమ్మలేక పోతున్నామని సజ్జల అన్నారు. ఎల్లుండి ఉదయం మేకపాటి స్వగ్రామంలో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
ఇక్కడే చివరి మజిలీ
నెల్లూరు అంటే మంత్రి మేకపాటికి అమితమైన ఇష్టం. నెల్లూరు(Nellore) వస్తే కచ్చితంగా నగరంలోని తన కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటారు. అక్కడే అందరినీ కలుస్తారు, మేకపాటి కార్యాలయంలో ఆయనకి అత్యంత ఇష్టమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashakar Reddy) ధ్యానముద్రలో ఉన్న ఫొటో కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫొటో కిందే మంత్రి మేకపాటి ఫొటోని కూడా ఉంచి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు నేతలు. హైదరాబాద్(Hyderabad) నుంచి పార్థివ దేహాన్ని తీసుకొచ్చి మంత్రి మేకపాటి కార్యాలయంలోనే ప్రజల సందర్శనార్థం ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. నగర పోలీస్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. మంత్రి కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాన్ని చదును చేయిస్తున్నారు. ఇక్కడే మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచుతారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆత్మకూరు(Atmakur) నియోజకవర్గం మర్రిపాడు మండల పరిధిలోని బ్రాహ్మణ పల్లికి తరలిస్తారు.
Also Read: మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం జగన్