AP Highcourt : రిషికొండపై ఉల్లంఘనలు జరిగాయన్న పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైకోర్టు నియమించిన కమిటీ పరిశీలించి అనుమతికి మించి తవ్వకాలు జరిపి.. నిర్మాణాలు జరిపినట్లుగా నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని.. ఎటువంటి చర్యలు తీసుకున్నారో మూడు వారాల్లోగా చెప్పాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో.. సుప్రీంకోర్టుకు ఏపీటీడీసీ హామీ ఇచ్చినట్లుగా గతంలో నిర్మాణాలు ఉన్న చోటనే నిర్మించారో లేదో పరిశీలించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.               

  


ఈ అంశంపై గతంలో హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు నియమించిన కమిటీ పరిశీలన జరిపి నివేదిక ఇచ్చింది. తర్వాత  కేసు విచారణకు రాలేదు. అదే సమయంలో విశాఖకు మకాం మారుస్తున్నాననంటూ జగన్ రెడ్డి ప్రత్యేకంగా కమిటీలు  ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జగన్ రెడ్డి ఉండటానికి రిషికొండపై కొత్తగా కట్టిన భవన బాగుంటుందని రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధమయింది. అందుకే గతంలో పిటిషన్లు వేసిన వారు.. హైకోర్టులో మరోసారి పిటిషన్ వేశారు. అక్కడ ప్రభుత్వం భవనాన్ని ప్రారంభిస్తోందని ..సీఎం అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టేందుకు సిద్ధమయ్యారని తమ పిటిషన్లపై విచారణ చేయాలని కోరారు. దీంతో హైకోర్టు మళ్లీ విచారణ చేపట్టి తాజా ఆదేశాలు జారీ చేసింది.                                      


 పర్యావరణ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించి రుషికొండలో తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.  అయితే ప్రభుత్వం మాత్రం అనుమతి ఉన్న వరకే తవ్వుతున్నామని వాదించింది. కానీ 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు మ్యాపులు సమర్పించారు. విచారణలో అనుమతి ఇచ్చిన దాని కన్నా మూడు ఎకరాలు అదనంగా తవ్వామని అంగీకరించింది. కానీ అంతకు మించి తవ్వారని పిటిషనర్లు వాదించడంతో సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సజావుగా సర్వే  నిర్వహించి నివేదిక సమర్పంచింది.                 


 కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌కి విరుద్ధంగా విశాఖజిల్లా, చినగదిలి మండలం, ఎండాడ గ్రామం పరిధిలోని సర్వేనెంబరు 19లో రుషికొండను తవ్వేయడంతో పాటు చెట్లను తొలగిస్తున్నారని పేర్కొంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన నాయకుడు పీవీఎన్‌ఎన్‌ మూర్తి యాదవ్‌ వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.  అనుమతులకు మించి కొండను తవ్వేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ భవనాల్లోనే సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టాలనుకోవడంతో  కేంద్ర అటవీ పర్యావరణ శాఖ తీసుకుబోయే చర్యలు కీలకంగా మారనున్నాయి.