Chandrababu Release :  ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. ఉదయం పదిన్నరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వచ్చింది. వెంటనే షరతుల మేరకు ఏసీబీ కోర్టులో రెండు ష్యూరిటీలను దేవినేని ఉమ, బొండా ఉమ సమర్పించారు. ఆ తర్వాత రిలీజ్ ఆర్డర్ ను ఏసీబీ కోర్టు నుంచి జైలుకు పంపించారు. లాంఛనాలు పూర్తి కావడంతో నాలుగు గంటల సమయంలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. 




చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన జడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆయన కాన్వాయ్ ఉండవల్లి నుంచి రాజమండ్రికి వచ్చింది. ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ మొత్తం  జైలు వద్దకు వచ్చింది. చంద్రబాబు కుటుంబసభ్యులు అందరూ జైలు వద్దకు వచ్చారు. నారా లోకేష్, బాలకృష్ణ కూడా  వచ్చారు. పెద్ద ఎత్తున జనం రావడంతో.. వారిని అదుపు చేసేందుకు కిలోమీటర్ ముందే పోలీసులు బారీకేడ్లను పెట్టారు. అయితే టీడీపీ కార్యకర్తలు తోసేసుకుని వెళ్లిపోయారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో యాభై రోజుల పాటు ఎప్పుడూ బయట కనిపించకుండా ఉండలేదు. ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చారు.రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి వెళ్తారు. చంద్రబాబు ర్యాలీచేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే ఎలాంటి ర్యాలీలు చేయడం లేదని  టీడీపీ స్పష్టం చేసింది. 


చంద్రబాబు విడుదలవుతున్న సమయంలోనే ఏపీ సీఐడీ అధికారులు హడావుడిగా హైకోర్టులో లంట్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ర్యాలీలు చేయకుండా చూడాలని.. మీడియాతో మాట్లాడవద్దని.. డీఎస్పీలు ఆయనపై నిఘా పెట్టేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన   పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రేపటి వరకూ చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనద్దని, రేపటి వరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు నిర్దేశించింది.       

              


చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు సుప్రీంకోర్టులో ఎనిమిదో తేదీలోపు రానుంది.  సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును  బట్టి చంద్రబాబు తదుపరి న్యాయపోరాటం ఉండే అవకాశం ఉంది. ఒక వేళ చంద్రబాబుకు 17ఏ  వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెబితే.. ఆయనపై  పెట్టిన కేసలేవీ చెల్లవు. ఆయనకు విదించిన రిమాండ్ కు చట్టవిరుద్ధంగా ప్రకటించినట్లవుతుంది.  ఒక వేళ 17 ఏ వర్తించదనుకుంటే.. ఆయనపై తనపై నమోదైన కేసుల విషయంలో  న్యాయపోరాటం చేయాల్సి ఉంటుంది.