AP No Flexi Ban :  ఆంధ్రప్రదేశ్ లో జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఫ్లెక్సీల నిషేధాన్ని హైకోర్టు పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది.  సింగిల్ యూజ్‌ ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధం వర్తిస్తుందని హైకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఓవెన్ , పీవీసీ ఫ్లెక్సీలకు ఈ నిషేదం వర్తించదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఫ్లెక్సీ ల పై నిషేదాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఫ్లెక్సీ ఓనవర్స్‌ అసోసియేషన్ కు భారీ ఊరట దక్కినట్లయింది. ఇవాళ విచారణలో మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేసింది.
 


సీఎం జగన్  విశాఖపట్నంలో ని బీచ్ లో వ్యర్థాలను వేరుచేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా  ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా తక్షణం ఫ్లెక్సీలను బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.  ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.  ఎవరైనా ప్లెక్సీలు పెట్టాలనుకుంటే క్లాత్‌తో  తయారు చేసినవి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అందు కోసం... ఫ్లెక్సీల వ్యాపారస్తులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. వారి యంత్రాలను అప్ గ్రేడ్ చేసుకునేందుకు రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి అనుకున్నంతగా  సహకారం లభించకపోవడంతో.. ఫ్లెక్స్ వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. 


ప్రభుత్వ నిర్ణయంపై కొంత కాలంగా ఫ్లెక్స్ ఓనర్లు ఆందోళనలు చేస్తున్నారు.  గత మూడు రోజులుగా బంద్ చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టు క్లాత్‌ ఫ్లెక్సీలు ముద్రించడానికి తమ వద్ద ఫ్లెక్సీ మిషన్లు పనిచేయవని, రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన మిషన్లు వృథా అవుతాయని ఫ్లెక్సీ ఓనర్లు చెబుతున్నారు.  చిన్న ఫ్లెక్స్‌ రూ.300 అవుతుంది.  క్లాత్‌తో అయితే రూ.900 అవుతుంది.  సామాన్యులెవరూ ఫ్లెక్సీలు వేయించుకునే పరిస్థితి ఉండదు.  బ్యాంక్‌ రుణాలు ఇస్తామని అధికా రులు చెప్పారేకానీ ఇంతవరకూ అసలు పట్టించుకోలేదని, ప్రత్యామ్నాయం చూపించకుండా, వీటికన్నా ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ను నిషేధించకుండా ఫ్లెక్సీలను నిషేధించ డం అన్యాయమనిఫ్లెక్స్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఒక్కో మిషన్‌ మీద ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 20 మంది ఆధారపడి బతుకుతున్నారని వీరంతా రోడ్డున పడతారని ఆందోళన చేస్తున్నారు. వీరిలో కొంత మంది కోర్టుకెళ్లడంతో ఊరట లభించింది. 


 ఇవాళ ఫ్లెక్సీ ఓ అవసరంగా మారిపోయింది. శుభ, అశుభకార్యాలు ఏవైనా ఫ్లెక్సీలు తప్పనిసరి అయ్యా యి. గతంలో సినిమా నటులతో పోస్టర్లు వచ్చేవి. వాటిని తలదన్నే విధంగా రాజకీయనేతలు, సంఘాలు, సినీనటుల అభిమానులు కూడా ఫ్లెక్స్‌లు పెట్టడం మామూలైంది. పెళ్లిళ్లకు, పుట్టినరోజులు, పుష్పవతి ఫంక్షన్లు, పంచికట్టు ఫంక్షన్లతోపాటు అటు వ్యాపార ప్రకటనల కోసం ఫ్లెక్స్‌లు ప్రధానమయ్యాయి. ఈనేపఽథ్యంలో వీటిని నిషేధించి, క్లాత్‌ ఫ్లెక్సీలు ముద్రించమనడంతో వీటి ఓనర్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మిషన్‌ ఖరీదు లక్షల్లో ఉంటుంది. దీని హెడ్‌ ఒకటే రూ.50 వేల నుంచి లక్షన్నర వరకు ఉంది.