శీతాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. చల్లటి గాలుల కారణంగా చర్మం పొడి బారిపోయి నిర్జీవంగా కనిపిస్తుంది. చేతులు, మొహం కాళ్ళు పగిలిపోయి తెల్లగా కనిపిస్తాయి. చర్మం వేగంగా ఎండిపోతుంది. అందుకే చర్మం తేమగా ఉంచేలా చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలి. హీటర్, బ్లోయర్ వేడి గాలి వల్ల చర్మం మరింత దెబ్బతింటుంది. గాలిలో తేమ స్థాయిలు తగ్గిపోవడం వల్ల చర్మం పొడిగా మారి బిగుతుగా అనిపిస్తుంది. అందుకే చర్మాన్ని సంరక్షించుకోవడం వల్ల రోజూ పాటించే కొన్ని బ్యూటీ కేరింగ్ విషయంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మ సమస్యలని నివారించవచ్చు.


హైడ్రేటింగ్ క్లెన్సర్


హైడ్రేటింగ్ క్లెన్సర్ అనేది చర్మం పొడిగా ఉంచకుండా శుభ్రపరిచి రీఫ్రెష్ గా చేస్తుంది. డెసిల్ గ్లూకోసైడ్, కోకో బీటైన్, మిరిస్టిక్ యాసిడ్ వంటి తేలికపాటి  పదార్థాలు ఉపయోగించడం మంచిది. ఇది చర్మాన్ని శుభ్రపరిచేటప్పుడు పొడి బారిపోకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది.


హైలురోనిక్ యాసిడ్ సీరమ్


హైలురోనిక్ యాసిడ్ సీరమ్ అనేది హైడ్రేట్డ్ స్కిన్ సాఫ్ట్ కోసం ఉపయోగిస్తారు. చర్మం ఎక్కువగా డీహైడ్రేట్ కాకుండా ఉంచడం కోసం ఫ్రాగ్మెంటెడ్ హైలురోనిక్ యాసిడ్‌ ఉపయోగించాలని చర్మనిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చర్మం లోపలి వరకు చొచ్చుకుని పోయి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ సీరమ్ పగటి పూట అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసుకోవడం మరచిపోవద్దు.


ఎమోలియెంట్ ఆధారిత మాయిశ్చరైజర్


చర్మం పరిస్థితిని ఆధారంగా చేసుకుని స్క్వాలేన్, అవోకాడో, బాదం నూనె వంటి వాటితో కూడిన ఎమోలియెంట్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం శీతాకాలంలో మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. నీటి ఆధారిత లోషన్లకు బదులుగా మందంగా నూనె ఆధారిత క్రీములు రాసుకుంటే చర్మానికి మంచిది. ఎందుకంటే నీరు సహజంగా ఆవిరైపోతుంది. అధిక నీటి కంటెంట్ ఉన్న ఉత్పత్తులు తేమని నిలపలేవు. అందుకే మందపాటి మాయిశ్చరైజర్లు వాడటం మంచిది.


సన్ స్క్రీన్ రాసుకోవాలి


శీతాకాలం కదా సూర్యుడి ఎండ ఎక్కువగా ఉండదు కదా అని సన్ స్క్రీన్ రాసుకోకుండా ఉండటం మంచిది కాదు. చలికాలంలో కూడా యూవీ కిరణాల వల్ల చర్మం పొడిబారిపోతుంది. దీని వల్ల చర్మం పగుళ్లు, ముడతలు, ఇన్ఫెక్షన్ల బారిన ఎక్కువగా పడుతుంది. అందుకే సన్ స్క్రీన్ రాసుకుంటే చర్మం తేమ స్థాయిలు స్థిరంగా ఉంటాయి.


ఎక్స్ ఫోలియేటర్


క్లీన్, హెల్తీ స్కిన్ కోసం ఎక్స్ ఫోలియేట్ చేయడం తప్పనిసరి. పొడి చర్మం, మంట వంటి వాటిని నివారించాలంటే సున్నితమైన ఎక్స్ ఫోలియేటర్ ని ఉపయోగించడం మంచిది.


పెదవులు మర్చిపోవద్దు


చలికాలంలో చర్మం మాత్రమే కాదు పెదవులు కూడా పగుళ్లు వస్తాయి. అందుకే ఎప్పుడూ లిప్ అయిల్స్ రాసుకోవాలి. ఈయల్ చేయడం వల్ల పెదవులు మృదువుగా ఉంటాయి.


బాడీ బటర్ తప్పనిసరి


చర్మాన్ని మృదువుగా చేసుకునేందుకు తప్పనిసరిగా బాడీ బటర్ అవసరం. ఇది చర్మం మీద గీతలు, ముడతలని నివారిస్తుంది. పొడి ప్యాచెస్ లేకుండా చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మచ్చలు పోయి చర్మం నిగనిగలాడాలంటే వేరుశెనగ తినండి