రిత్ర సృష్టించేందుకు ‘RRR’ సినిమా అడుగు దూరంలో నిలిచింది. ఈ సినిమాలోని 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ నామినేషన్ లభించింది. యావత్ భారతదేశం ఉప్పొంగిపోతోంది. ఈ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి స్పందించారు. ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ కు నామినేట్ కావడం పట్ల ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.


ఇంతకంటే ఏం కావాలి? టార్చర్ పెట్టినందుకు క్షమించండి!


 "మా సినిమాలో మా పెద్దన్న (కీరవాణి) తన పాటకు గాను ఆస్కార్ నామినేషన్ పొందారు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు నేను తారక్, చరణ్ ను మించిపోయేలా ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేస్తున్నాను. చంద్రబోస్ గారూ కంగ్రాచ్యులేషన్స్! ఆస్కార్ వేదిక మీద మన పాట వినిపిస్తోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఈ పాట కోసం మీ కృషి అమూల్యం. మీకు నా వ్యక్తిగత ఆస్కార్ ఇచ్చేస్తాను. ఈ పాట విషయంలో చాలా రోజుల పాటు సందిగ్ధంలో ఉన్న నాకు భైరవ బీజీఎం ఎంతో భరోసా ఇచ్చింది. ఈ పాటను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చన్న నమ్మకం కలిగించింది. థాంక్యూ భైరి బాబు. సూపర్ ఎనర్జిటిక్ గాత్రంతో రాహుల్, భైరవ ఈ పాటను పాడారు. ఈ పాట ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య సమన్వయం, స్టయిల్. తమదైన శైలిలో వారు చేసిన డ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకింది. ‘RRR’ షూటింగ్ వేళ నేను పెట్టిన టార్చర్ కు వారి నుంచి క్షమాపణలు కోరుతున్నాను. అవకాశం దొరికితే మరోసారి వారిని కష్టపెట్టేందుకు వెనుకాడను” అన్నారు.






నేనెప్పుడూ ఆస్కార్ వరకు వెళతానని అనుకోలేదు- రాజమౌళి


“అసలు నేనెప్పుడూ ఆస్కార్ వరకు వెళతానని అనుకోలేదు. ఇదంతా ‘నాటు నాటు’ పాటకు, ‘RRR’కు ఉన్న అభిమానుల వల్లే సాధ్యమైంది. వారి అభిమానం చూసిన తర్వాత ఈ పాటను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మా మనసుల్లో కలిగింది. వీరాభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు.  ఈ సందర్భంగా కార్తికేయ గురించి చెప్పుకోవాలి. అలుపెరగకుండా, పని రాక్షసుడిలా వ్యవహరించిన కార్తికేయ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నీ పట్ల గర్విస్తున్నాను కార్తికేయ.  ఇక సోషల్ మీడియాలో రోజులో 24 గంటలూ ‘RRR’కు, ‘నాటు నాటు’ పాటకు ప్రచారం కల్పించడంలో కృషి చేసిన ప్రదీప్, హర్ష, చైతన్యలకు కృతజ్ఞతలు. ఆస్కార్ కు మరొక్క అడుగుదూరంలో ఉన్నాం... థాంక్యూ!" అంటూ రాజమౌళి పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టు చూసి రాజమౌళి అభిమానులు కూడా భావోద్వేగానికి గురవ్వుతున్నారు. తెలుగు రాష్ట్రాల కీర్తిని ‘ఆస్కార్’ తీసుకెళ్లిన మీరు.. దాన్ని గెలుచుకున్నా, గెలుచుకోకపోయినా పర్వాలేదని, మీరు ప్రపంచ సినీ ప్రేమికుల మనసు ఇప్పటికే గెలుచుకున్నారంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 


Read Also: ఆస్కార్ కు ‘ఆల్ దట్ బ్రీత్స్’ నామినేట్, ఈ డాక్యుమెంటరీ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?