Rohit Sharma:


టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియా సమావేశాల్లో సరదాగా ఉంటాడు. విలేకరులతో జోకులు వేస్తుంటాడు. అలాంటిది న్యూజిలాండ్‌తో మూడో వన్డే ముగిశాక బ్రాడ్‌కాస్టర్‌పై ఫైర్‌ అయ్యాడు. గణాంకాలను ప్రదర్శించేటప్పుడు యథార్థ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశాడు. అతడికి మూడేళ్లలో ఇదే తొలి సెంచరీగా పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. వేర్వేరు కారణాలతో అసలు తాను క్రికెట్టే ఆడలేదని వెల్లడించాడు.


న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. హోల్కర్‌ స్టేడియంలో సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించాడు. చాన్నాళ్ల తర్వాత సెంచరీతో మురిపించాడు. వన్డేల్లో 30వ శతకం అందుకున్నాడు. అయితే 2020, జనవరి తర్వాత అతడికితే తొలి మూడంకెల స్కోరు కావడం గమనార్హం. గణాంకాల పరంగా ఇది వాస్తవమే. బ్రాడ్‌కాస్టర్‌ దీనినే ప్రదర్శించగా ఇది యథార్థ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని రోహిత్‌ భావించాడు.


'మూడేళ్లలో తొలి సెంచరీ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ మూడేళ్లలో నేను ఆడింది 12 (17) వన్డేలు. మూడేళ్లని చెబితే ఎంతో కాలంగా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. టీవీల్లో మీరిది చూపించారని నాకు తెలుసు. కానీ యథార్థ పరిస్థితులను మీరు వివరించాలి' అని రోహిత్‌ అన్నాడు. 'హిట్‌మ్యాన్‌' పునరాగమనం చేసిన్టటేనా అని మరో జర్నలిస్టు ప్రశ్నించగా 'నేనింతకు ముందే చెప్పినట్టు 2020లో అసలేం మ్యాచులు లేవు. కొవిడ్‌ 19 వల్ల అందరూ ఇంటివద్దే ఉన్నారు. ఆడిన వన్డేలు చాలా తక్కువ. గాయం కావడంతో రెండే టెస్టులు ఆడాను. మీరు ఆ దృక్పథాన్నీ చూపించాలి' అని రోహిత్‌ పేర్కొన్నాడు.


'మేం గతేడాది నుంచే టీ20 క్రికెట్‌ ఆడుతున్నాం. అందులోనూ ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో సూర్యకుమార్‌ యాదవ్‌ను మించిన బ్యాటర్‌ ఎవ్వరూ లేరు. అతడు రెండు సెంచరీలు కొట్టాడు. అలా ఎవ్వరూ చేయలేదు' అని రోహిత్‌ అన్నాడు. మూడో వన్డేలో శార్దూల్‌ ఠాకూర్‌ అద్భుతంగా ఆడాడని హిట్‌మ్యాన్‌ ప్రశంసించాడు. రెండో స్పెల్‌లో వరుసగా వికెట్లు తీశాడని వెల్లడించాడు. 'కీలక సమయాల్లో వికెట్లు తీయడం అతడికి తెలుసు. కేవలం వన్డేల్లోనే కాదు టెస్టుల్లోనూ మనమిది చూశాం. ఒక జట్టుగా అతడు మాకెంతో కీలకం' అని వివరించాడు.




IND vs NZ, 3rd ODI- Full Match Highlights: మూడో వన్డేలోనూ టీమిండియా దుమ్మురేపింది. 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై రోహిత్ సేన ఘన విజయం సాధించింది. దాంతో న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 3-0 తో వైట్ వాట్ చేసింది టీమిండియా. ముందు బ్యాటింగ్, తరువాత బౌలింగ్ లో చెలరేగిన టీమిండియా పర్యాటక కివీస్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ జట్టు 41.2 ఓవర్లలో 295 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే శతకం (138 ; 100 బంతుల్లో 12x4, 8x6)తో మెరిశాడు. హెన్రీ నికోల్స్ (42 ; 40 బంతుల్లో 3x4, 2x6), మిచెల్ శాంట్నర్ (34 ; 29 బంతుల్లో 3x4, 2x6) టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ చెరో 3 వికెట్లతో కివీస్ బ్యాటర్లను అడ్డుకున్నారు.