Shubman Gill:
సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీలో ఎవరిని ఎంచుకుంటావంటే కింగ్ కోహ్లీనే అంటున్నాడు శుభ్‌మన్ గిల్! మాస్టర్ బ్లాస్టర్ రిటైర్ అయినప్పుడు తనకు ఎక్కువ పరిణతి లేదన్నాడు. విరాట్‌ను చూసే ఎక్కువ నేర్చుకున్నానని వివరించాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డే తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీసులో శుభ్‌మన్ గిల్ తన అత్యుత్తమ ఆటతీరును బయటకు తీశాడు. తొలి వన్డేలో డబుల్ సెంచరీ బాదేశాడు. రెండో వన్డేలోనూ అజేయంగా నిలిచాడు. మూడో వన్డేలో అద్భుతమైన శతకం బాదేశాడు. మూడు వన్డేల సిరీసులో అత్యధిక పరుగులు చేసిన బాబర్ ఆజామ్‌తో సమవుజ్జీగా నిలిచాడు. ఈ సిరీసులో 360 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు 21 మ్యాచులాడిన గిల్ 73.76 సగటుతో కొనసాగుతున్నాడు.
మ్యాచ్ ముగిశాక సచిన్, కోహ్లీలో నువ్వు ఎవరిని ఎంచుకుంటావన్న ప్రశ్నకు గిల్ జవాబు ఇచ్చాడు. 'బహుశా విరాట్ భాయ్ పేరే చెబుతా. నిజానికి సచిన్ సర్ వల్లే నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టాను. మా నాన్న ఆయనకు పెద్ద అభిమాని. ఆయన ఆటకు వీడ్కోలు పలికినప్పుడు నాకు క్రికెట్‌ను అర్థం చేసుకొనేంత వయసు లేదు. విరాట్ భయ్య ఆడుతున్నప్పుడు నేను క్రికెట్ మరింత బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఒక బ్యాటర్‌గా అతడి నుంచే ఎక్కువ నేర్చుకున్నాను' అని ఈ యువ ఓపెనర్ అన్నాడు.
IND vs NZ, 3rd ODI- Full Match Highlights: మూడో వన్డేలోనూ టీమిండియా దుమ్మురేపింది. 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై రోహిత్ సేన ఘన విజయం సాధించింది. దాంతో న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 3-0 తో వైట్ వాట్ చేసింది టీమిండియా. ముందు బ్యాటింగ్, తరువాత బౌలింగ్ లో చెలరేగిన టీమిండియా పర్యాటక కివీస్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ జట్టు 41.2 ఓవర్లలో 295 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే శతకం (138 ; 100 బంతుల్లో 12x4, 8x6)తో మెరిశాడు. హెన్రీ నికోల్స్ (42 ; 40 బంతుల్లో 3x4, 2x6), మిచెల్ శాంట్నర్ (34 ; 29 బంతుల్లో 3x4, 2x6) టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ చెరో 3 వికెట్లతో కివీస్ బ్యాటర్లను అడ్డుకున్నారు.
అంతకు ముందు హోల్కర్ స్టేడియం హోరెత్తింది. ఇండోర్ నగరం దద్దరిల్లింది. స్టాండ్స్‌లోని ప్రేక్షకులు సిక్సర్ల వర్షంలో తడిసి ముద్దయ్యారు. బౌండరీల వరదకు థ్రిల్లయ్యారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (101; 85 బంతుల్లో 9x4, 6x6), శుభ్‌మన్ గిల్ (112; 78 బంతుల్లో 13x4, 5x6) సెంచరీలు బాదడంతో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసింది. మూడో వన్డేలో న్యూజిలాండ్ ముందు 386 పరుగుల టార్గెట్ ఉంచింది. ఆఖర్లో హార్దిక్ పాండ్య (54; 38 బంతుల్లో 3x4, 3x6), శార్దూల్ ఠాకూర్ (25; 17 బంతుల్లో 3x4, 1x6) దంచికొట్టారు. టీమ్‌ఇండియా 385/9తో ఇన్నింగ్స్ ముగించింది.