లోకేష్ యాత్ర, జనసేన, సీబీఐ విచారణపై సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి రోజా. తిరుపతిలో వెరిటాస్ సైనిక్ స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొన్న రోజా.. ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోకేష్ చేపట్టేది యువగళం కాదని.. టిడిపికి సర్వమంగళం అని విమర్శించారు. కావాలనే కొన్ని పచ్చ ఛానెల్స్ చాలా హైప్ ఇస్తున్నాయన్నారు. దశ దిశ లేకుండా ప్రజలకు ఏం చేశారో చెప్పలేని వాళ్ళు పాదయాత్రలో ఏం చెప్తారన్నారు.
సీఎం జగన్‌ను తిట్టడానికే పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు మంత్రి రోజా. జగన్‌ను ఎంత తిడితే అంత ఆశీర్వాదం లబిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజాసమస్యలపై పోరాటం చేసి జగన్ పాదయాత్ర చేశారన్నారు. అధికారంలోకి వచ్చి 99శాతం అమలు చేశారని గుర్తు చేశారు. వార్డు మెంబర్‌కు ఎక్కువ, ఎమ్మేల్యేకు తక్కువైన లోకేష్ ఏ యాత్రైనా చేసుకోవచ్చన్నారు. పోటీ చేసిన మొదటిసారి ఓడిపోయిన వ్యక్తని.. అలాంటి వ్యక్తుల్ని చూసి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు భయపడబోరన్నారు. ముందు టీడీపీ ప్రక్షాళన చేయాలంటూ సలహా ఇచ్చారు.
సీబీఐను టీడీపీ ప్రభావితం చేసి అవినాష్ రెడ్డిప్యామిలీని టార్గెట్ చేసిందని విమర్శించారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ చేతగానితనం వల్లే ఓ మాజీ మంత్రి తన ఇంట్లో హత్యకు గురయ్యారన్నారు. చంద్రబాబు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల హత్య జరిగిందన్నారు. ఇలాంటి వైఫల్యాలను కప్పిపుచ్చి... ఇదేదో జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిందన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. హత్య జరిగిన రోజే ఎంక్వయిరీ చేసి తప్పు చేసిన వాళ్లను జైల్లో పెట్టాల్సిందిపోయింది ఇప్పుడు విమర్శలేంటని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్ రాసి వాళ్ల నిందింతులు పేర్లు పెట్టే అవకాశం ఉండి కూడా తెలుగుదేశం ఏం చేయలేకపోయిందన్నారు. ఎప్‌ఐఆర్‌లో అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు లేవంటే వాళ్లు తప్పు చేయలేదని అన్నారు మంత్రి రోజా. ఇప్పుడు మాత్రం వాళ్లను సీఎం జగన్ కాపాడుతున్నట్టు టీడీపీ కలరింగిస్తోందన్నారు. ఇలాంటి ప్రచారం టీడీపీ ఏ ఉద్దేశంతో చేస్తోందో ప్రజలందరికీ తెలుసని రోజా కామెంట్ చేశారు.
తమిళ సినిమా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌లో భూముల కేటాయింపు అంశంపై కూడా రోజా స్పందించారు. అలా జరిగితే మంచిదేనన్నారు. ఇక్కడ టూరిజం అభివృద్ధి చెందుతుందని... తద్వార ఆదాయం లభిస్తుందన్నారు. అయితే ఆ విషయం తన వరకు ఇంకా రాలేదన్నారు.
ఎవరైనా ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చన్నారు రోజా. ప్రజలను ఇంప్రెస్ చేయవచ్చన్నారు. కానీ పార్టీలు పెట్టి వాటిని కాంగ్రెస్‌లో విలీనం చేయడం.. మళ్లీ పార్టీలు పెట్టి బీజేపీ, టీడీపీకి ఓటు వేయమని చెప్పడం... మళ్లీ బయటకు వచ్చి ఆ రెండు పార్టీలను తిట్టడం మళ్లీ ఇప్పుడు కలవడమేంటని ప్రశ్నించారు. బీజేపీ రూట్ మ్యాప్ ప్రకారం పని చేస్తాని చెబుతూనే... టీడీపీతో చేరి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధపడుతున్నారని ఆరోపించారు. అసలు అది జనసేనా... లేకుండే చంద్రసేనా అని ప్రశ్నించారు.
అక్కినేనిపై బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై కూడా రోజా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అలాంటి కామెంట్స్ చేయడం మంచిది కాదన్నారు. అదే మాట ఎన్టీఆర్‌ను అంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు రోజా.