కొత్త పీఆర్సీపై చర్చలు సఫలవ్వడంతో సమ్మె ఆలోచన విరమించుకున్నారు ఉద్యోగులు. శనివారం రాత్రి మంత్రుల కమిటీ, పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ఉమ్మడి మీడియా సమావేశంలో చర్చలు సఫలం అయ్యాయని ప్రకటించారు. ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా చేయగలిగినంత చేశామని సీఎం అన్నారు. సీఎంతో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాలు నేతల మీడియాతో మాట్లాడారు. 


ఐదేళ్లకు ఒసారి పీఆర్సీ ఉద్యోగుల విజయం 


చలో విజయవాడలో లక్ష మంది ఉద్యోగులు ఆందోళన  చేశారని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ అన్నారు. ఫిట్మెంట్ లో పెరుగుదల  లేకపోయినా మిగిలిన  అంశాల్లో  సంతృప్తి ఉందన్నారు. హెచ్ఆర్ఏ, అదనపు పెన్షన్,  సీసీఏల వల్ల  ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగానే వ్యవహరించిందన్నారు. ఫిట్మెంట్ తప్ప అన్ని విషయాల్లో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మరో నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ ఇవ్వడం పీఆర్సీ సాధన సమితి విజయం అన్నారు. హెచ్ఆర్ఏ స్లాబ్ పెరగడం వల్ల జీతం తగ్గదన్నారు. రివర్స్ పీఆర్సీకి ఆస్కారం  లేదన్నారు. ఉద్యోగుల ఉద్యమ ఫలితంగా కొన్ని అదనపు ఫలితాలు వచ్చాయన్నారు. ఒక్క శాతం తప్ప తెలంగాణతో సమానంగా హెచ్‌ఆర్‌ఏ సాధించుకున్నామన్నారు. మార్చిన హెచ్‌ఆర్‌ఏ వల్ల కొత్త పీఆర్సీ ప్రకారం జీతం తగ్గదన్నారు. రివర్స్‌ పీఆర్సీకి తావులేకుండా జీతాల పెంపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. 


ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఐక్యత వల్లే సాధ్యమైంది : బొప్పరాజు 


ఉదోగ్యం సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితి బాగుంటే భవిష్యత్ లో మరింత ప్రయోజనాలు ఉంటాయని సీఎం చెప్పారన్నారు. పీఆర్సీ సాధన సమితి సాధించిన ప్రయోజనాల భారం రూ.1300 కోట్లు అన్నారు. ఐఆర్ రికవరీ వల్ల మరో రూ5 వేల కోట్లు ప్రభుత్వంపై భారం అన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఐక్యత వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇది ప్రారంభం  మాత్రమే అన్న ఆయన భవిష్యత్ లో ఇలాగే ఉద్యోగులు సహకారించాలన్నారు. 


ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత చిన్న అపశ్రుతి : సజ్జల 
 
ఉన్నదాంట్లో ఇంకా మేలు చేయగలిగితే ఉద్యోగులకు ఇంకా చెయ్యాలని సీఎం జగన్ అన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అదనంగా భారం అయినా కూడా  అధికారులు, సీఎంతో  మాట్లాడి అన్ని విషయాలు సర్దుబాటు చేశామన్నారు. ఇంకా కొన్ని కోరికలు ఉన్న కూడా భవిష్యత్ లో దృష్టి పెడతామన్నారు. ఫిట్మెంట్ పెంచడానికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదన్నారు. ఫిట్మెంట్   కాకుండా మిగిలిన అన్ని అంశాల్లో ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఆర్థికభారం పడినా కొన్ని అంశాలు హెచ్ఆర్ఏ సీసీఏ అదనపు ప్రయోజనాలు కల్పించామన్నారు. ఒకవేళ కొన్ని అభ్యంతరాలు  ఉంటే రాత్రి చెప్పాల్సిందన్నారు. మినిట్స్ కూడా తయారుఅయ్యాక బయటికి వెళ్లి మాట్లాడడం మంచిది కాదన్నారు. కొన్ని పట్టు విడుపులు ఉంటాయన్న సజ్జల కొన్ని సందర్భాల్లో సర్దుకుని వెళ్లాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలు  వ్యతిరేకత  చూపించడం చిన్న అపశ్రుతి అన్నారు. 


Also Read: ఈ ప్రభుత్వం మీది.. మీరు లేకపోతే నేను లేను, మీకు సాధ్యమైనంత చేశాం: సీఎం జగన్‌