టీమ్‌ఇండియా 1000వ వన్డేలో తాము భాగస్వాములు అవుతుండటం గర్వంగా అనిపిస్తోందని రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ రాహుల్‌ ద్రవిడ్‌ అంటున్నాడు. భారత క్రికెట్‌ చరిత్రలో ఇదో కీలక మైలురాయిగా వర్ణించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తమకూ చోటు లభించడం ఆనందంగా ఉందన్నారు. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు వీరితో మాట్లాడించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పంచుకొంది.


'భారత క్రికెట్‌కు ఇదో గొప్ప రోజు. టీమ్‌ఇండియా 1000వ వన్డే మ్యాచ్‌ ఆడుతోంది. ఎంతో మంది జట్టు తరఫున ఆడారు. ఈ ప్రతిష్ఠాత్మక పోరులో కర్రాళ్లను నేనే నడిపిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇదో గొప్ప గౌరవం. క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతో మంది కృషి చేశారు. మేమూ అందుకు భిన్నమేమీ కాదు. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే ప్రయత్నిస్తున్నాం. జాతీయ పతాకం అత్యున్నత ఎత్తులో ఎగిరేందుకే శ్రమిస్తున్నాం' అని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.






'ఈ సుదీర్ఘ ప్రయాణంలో టీమ్‌ఇండియా ఎన్నో ఒడుదొడుకులను చవిచూసింది. ఎన్నోసార్లు పరివర్తన చెందింది. మా రిజర్వు బెంచీ బలం మెరుగైంది. ఈ ప్రయాణంలోనూ నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది. వెయ్యి అనేది పెద్ద సంఖ్యే. ఇది మేం ఆడిన మ్యాచులకు ఒక టెస్టిమొనీగా నిలుస్తుంది. 1000 వన్డేలో భాగమవ్వడం కచ్చితంగా గర్వపడే విషయమే' అని మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపాడు.


'1974 నుంచి భారత వన్డే క్రికెట్‌ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోంది. తొలి పదేళ్లలో జట్టెంతో కష్టపడింది. 1983లో ప్రపంచకప్‌ గెలవడం క్రికెట్‌ దశను మార్చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఐసీసీ ప్రపంచకప్‌లు నిర్వహించడంతో వన్డే క్రికెట్‌ అందరిలోనూ జీర్ణించుకుపోయింది. 1983, 2011 ప్రపంచకప్‌ గెలవడం అద్భుతం. కేవలం వన్డేలే కాకుండా టెస్టు, టీ20 క్రికెట్‌కు దేశంలో సూపర్‌ హిట్టయ్యాయి' అని టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వివరించారు.


Also Read: హమ్మయ్య ప్రపంచకప్‌ గెలిచేశాం! మేమిక ఐస్‌క్రీములు తినేస్తాం అంటున్న యశ్‌ధుల్‌


Also Read: లక్కంటే హిట్‌మ్యాన్‌దే! టీమ్‌ఇండియా 1000 వన్డేకు సారథ్యం! ఈ Stats చూస్తే ఆశ్చర్యమే!