తమ విజయంతో ప్రతి భారతీయుడు గర్వపడతాడని టీమ్‌ఇండియా అండర్-19 కెప్టెన్ యశ్ ధుల్ అంటున్నాడు. ప్రపంచకప్ కోసం జట్టు సభ్యులంతా కఠినమైన డైట్ పాటించామని పేర్కొన్నాడు. ఇప్పుడు సంతోషంగా ఐస్‌క్రీములు ఆరగిస్తామని చెబుతున్నాడు. ఇంగ్లాండ్‌పై విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
'దేశం గర్వపడే క్షణాలివి. మేమంతా కలిసి ఈ విజయం సాధించాం. మొదట్లో జట్టు కూర్పు ఎంతో కష్టమయ్యేది. సమయం గడిచే కొద్దీ మేమంతా ఒక కుటుంబంగా మారిపోయాం. జట్టు వాతావరణం కూడా చాలా బాగుంది. ఇంత మంది సహాయ సిబ్బంది మాకు సాయం చేసినందుకు సంతోషంగా ఉంది' యశ్ అన్నాడు. 'కరోనా వల్ల మేం ఇబ్బందులు పడ్డాం. కానీ ప్రతి ఆటగాడు దృఢచిత్తంతో నిలబడ్డారు. మా శిబిరంలోని ప్రతి ఒక్కరూ మానసికంగా బలవంతులే. అందుకే మేమీ విజయం అందుకోగలిగాం' అని అతడు పేర్కొన్నాడు.
ప్రపంచకప్ కోసం కుర్రాళ్లంతా కఠినమైన డైట్‌ను పాటించాల్సి వచ్చింది. ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను వదిలేయాల్సి వచ్చింది. విజయం సాధించాం కాబట్టి ఇక ఐస్‌క్రీమ్‌లు లాగిస్తామని యశ్‌ధుల్ అంటున్నాడు. 'ప్రతి ఒక్క ఆటగాడి గదిలోకి ఐస్‌క్రీమ్‌లు వచ్చేశాయి. మేమిప్పుడు వాటిని ఆస్వాదిస్తాం. ఈ టోర్నీ కోసం మేం కఠిన ఆహార నియమాలు పాటించాం. అందుకే మేమిప్పుడు ఐస్‌క్రీములు తింటాం' అని యశ్ తెలిపాడు.
Also Read: యువ క్రికెట్‌లో ఎదురు లేని భారత్, ఐదోసారి అండర్-19 కప్ కైవసం, అదరగొట్టిన కుర్రాళ్లు!
Also Read: కుంబ్లే వల్లే డ్రస్సింగ్ రూమ్‌లో భయానక వాతావరణం: బీసీసీఐ మాజీ అధికారి వెల్లడి
అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదోసారి కప్‌ను ముద్దాడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ ఈ కప్‌ను ఐదోసారి గెలవడం విశేషం. ఏ జట్టుకైనా ఇదే అత్యధికం. భారత్ తర్వాత ఆస్ట్రేలియా అత్యధికంగా మూడు సార్లు ఈ కప్‌ను విజయం సాధించింది.