AP BC Corporations : బీసీ కార్పొరేషన్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 55 బీసీ కార్పొరేషన్లను యథావిధిగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తున్నామని తాజా అస్త్రం ప్రయోగించింది ప్రభుత్వం. గత ఎన్నికల్లో వైసీపీకి బీసీలు అండగా నిలిచారు. దీంతో అధికారంలోకి రాగానే బీసీ కులాలకు ప్రాధాన్యత ఇస్తూ 55 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కార్పొరేషన్లను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కార్పొరేషన్ల ద్వారా బీసీలకు పలు పథకాలు అందించేందుకు ఏటా వేల కోట్ల నిధులు కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తుంది.
బీసీ కార్పొరేషన్లకు గుడ్ న్యూస్
గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన వైసీపీ... వచ్చీ రాగానే రాష్ట్రంలో జనాభా పరంగా అధికంగా ఉన్న బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ 55 బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేసింది. వీటిలో ప్రతీ కార్పొరేషన్ కు ఛైర్మన్ తో పాటు డైరెక్టర్లను నియమించింది. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడిన వాళ్లు, భవిష్యత్తులో ఉపయోగపడతారు అనుకునే వాళ్లకు పదవులు దక్కాయి. ఈ కార్పొరేషన్లు రెండేళ్ల పదవీకాలంతో పాటు జీతభత్యాల్ని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా బీసీ కార్పొరేషన్లకు వైసీపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో నియమించిన 55 బీసీ కార్పోరేషన్ల పదవీకాలం 2022 డిసెంబర్ 16తో ముగిసింది. దీంతో ఆయా కార్పొరేషన్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి జీవో విడుదల చేసింది. 55 కార్పొరేషన్లలోని ప్రతీ కార్పొరేషన్ కు ప్రత్యేకంగా ఒక్కో జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో కార్పొరేషన్ ఏర్పాటు, పదవీకాలంతో పాటు ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం పెంపును తెలియజేసింది. దీంతో ఆయా కార్పొరేషన్ల పదవీకాలం పూర్తయిన కూడా కొనసాగబోతున్నాయని స్పష్టం చేసింది.
తదుపరి ఉత్తర్వుల వరకూ పదవీకాలం పొడిగింపు
ఏపీలోని 55 బీసీ కార్పోరేషన్ల పదవీకాలాన్ని తదుపరి ఉత్తర్వులు విడుదల చేసే వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు మళ్లీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వరకూ పదవుల్లో కొనసాగనున్నారు. వచ్చే ఎన్నికలు వరకూ బీసీ కార్పొరేషన్లు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికలతో సంబంధం లేకుండా వచ్చే ప్రభుత్వంలోనూ కార్పొరేషన్ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తాజా ఉత్తర్వులతో మరోసారి గుర్తుచేసినట్లయింది.
అధికారాలు లేవని ప్రతిపక్షాలు విమర్శలు
ఈ కార్పొరేషన్లతో బీసీలు తల ఎత్తుకునేలా చేశామని ప్రభుత్వం చెబుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అసలు ఏమీ చేయలేదని దుమ్మెత్తి పోస్తున్నాయి. పథకాలతో మాయ చేస్తున్నారనే తప్ప శాశ్వతంగా బీసీలు పేదరికం నుంచి బయట పడేందుకు ఎలాంటి కార్యక్రమాలు లేవంటున్నారు. ఎలాంటి అధికారాలు లేని బీసీ కార్పొరేషన్లు దేని కోసమని ప్రశ్నిస్తున్నారు. ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లు వైసీపీ ప్రభుత్వం నామ మాత్రంగా మార్చేసిందని ఆరోపిస్తున్నాయి. బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఘనంగా ప్రకటిండమే తప్ప.. గత ప్రభుత్వాలతో పోలిస్తే స్వయం ఉపాధి కింద చాలా తక్కువ రుణాలు ఇచ్చిందంటున్నారు.