ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలకంగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ను ( Praveen Prakash IAS ) ఢిల్లీలోని  ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.  ప్రస్తుతం ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనా ఉన్నారు. తక్షణం ఆమెను  రిలీవ్‌ చేస్తూ ప్రవీణ్‌ ప్రకాశ్‌ను ఆ స్థానానికి బదిలీ చేస్తూ సీఎస్‌ సమీర్‌ శర్మ ( CS Sameer Sarma ) ఉత్తర్వులు చేశారు. సీఎంవోలోకి రాక ముందు ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గానే ఉండేవారు. జగన్ సీఎం బాధ్యతలు చేపట్టిన మొదట్లో ఢిల్లీలో జరిగిన ఓ టీటీడీ కార్యక్రమంలో నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన ఏపీ సీఎంవోలోకి వచ్చి కీలకంగా ఎదిగారు. 


చాలా  రోజుల పాటు సీఎం ముఖ్య కార్యదర్శిగానే కాకుండా.. జీఏడీ పొలిటికల్‌ ముఖ్యకార్యదర్శిగా  కూడా చాలా చక్రం తిప్పారు.  సీఎం జగన్ కూడా బాగా చనువు, చొరవ ఇవ్వడంతో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాషే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అనేక వివాదాస్పద నిర్ణయాల వెనుక ఆయన పాత్ర ఉందని అధికారవర్గాల్లో ప్రచారం ఉంది. ఆయన తీరుపై సీఎం జగన్ ( CM Jagan ) అసంతృప్తిగా ఉండటంతో గత ఏడాది జూలైలో జీఏడీ పొలిటికల్‌ బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా మాత్రం కొనసాగుతున్నారు. 


జగన్ నమ్మిన అధికారిగా ప్రవీణ్ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర సంబంధాలను చూస్తున్నట్లుగా తెలుస్తోంది.  విభజన చట్టంలోని అంశాలను కేంద్రంతో చర్చించే బాధ్యతను ప్రవీణ్ ప్రకాషే చూస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల  రిపబ్లిక్ డే రోజు మోకాళ్లపై కూర్చొని ప్రవీణ్ ప్రకాష్ సీఎం జగన్‌కు ఏదో చెబుతూండటం మీడియాలో హైలెట్ అయింది.  అయితే ఇంత హఠాత్తుగా ఎందుకు ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేశారన్నదానిపై స్పష్టత లేదు. 


ప్రస్తుతం విభజన చట్టం అంశాలపై పదిహేడో తేదీన కేంద్ర  హోంశాఖ త్రిసభ్య కమిటీతో చర్చలు జరగాల్సి ఉంది. ఆ సమావేశం ఎజెండాలో ఉమ్మడి అంశాలు కాకుండా ప్రత్యేకహోదా, లోటు  భర్తీ వంటివి చేరాయి. అవి ఎలా చేరాయన్నదానిపై తీవ్ర దుమారం రేగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం తరపున ఈ వ్యవహారాలు చూస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేయడం అనూహ్య పరిణామంగా మారింది. ఇటీవల ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ తీసుకుని యూపీ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన జగన్ సీఎం అయినప్పుడు ఏ పోస్టింగ్‌లో ఉన్నారో మళ్లీ అదే పోస్టింగ్‌కు చేరుకున్నారు.