ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల హాజ‌రుపై ఫోక‌స్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం స‌చివాల‌యంలో ఉద్యోగులంద‌రికీ బ‌యోమెట్రిక్ హాజ‌రును త‌ప్పనిస‌రి చేసింది. ఈ విధానంపై ఇప్పటికే సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ మెమో జారీ చేసింది. తాజాగా మరో మెమో జారీచేసింది. రాష్ట్రంలోని వివిధ‌ ప్రభుత్వ విభాగాలు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల‌ హాజరు వివరాల నియంత్రణకు సూచనలు చేసింది. ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులకు బయోమెట్రిక్ విధానంపై సూచనలు జారీ చేసింది. బయోమెట్రిక్ హాజరును నిరంతరం పర్యవేక్షిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయంలోని ఉద్యోగుల హాజరు వివరాలను రోజువారీగా సంబంధిత శాఖ కార్యదర్శి పరిశీలించాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీచేసింది. 


Also Read:  ఈ నెల 9న ఒడిశాకు ముఖ్యమంత్రి జగన్.. నవీన్ పట్నాయక్ తో భేటీ.. ఎందుకంటే?


బయోమెట్రిక్ హాజరుపై ప్రతీ నెల నివేదిక


రాష్ట్ర సచివాలయంలో సుమారు 10 శాతం మంది ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు తెలిసిందని ప్రభుత్వం పేర్కొంది. సచివాలయంలోని అన్ని విభాగాల్లోనూ 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించింది. ఈ విషయంపై ఇప్పటికే జారీ చేసిన నిబంధనలను ఇకపై తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగ విరమణ చేసిన, బదిలీ అయిన ఉద్యోగులకు సంబంధించిన వివరాలను బయోమెట్రిక్ పరికరాల నుంచి తొలగించాలని తెలిపింది. బయోమెట్రిక్ హాజరు నివేదికలను ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. ఇందుకు ఆయా శాఖ కార్యదర్శి ఉద్యోగుల హాజరును పరిశీలించాలని పేర్కొంది.


Also Read: వాళ్లు తిరగబడితే పారిపోతారు.. దమ్ముంటే ఆ పని చేస్తారా?


మూడుసార్లు మాత్రమే ఆలస్య హాజరుకు అనుమతి


ప్రభుత్వ ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ఏపీ సర్కార్ ఇప్పటికే మెమో విడుదల చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బయోమెట్రిక్ అటెండెన్స్ పై ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్-19 ఉద్ధృతి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న కారణంగా బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసినట్లు మెమోలో వెల్లడించింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులందరికీ ఐదు రోజుల పనిదినాల విధానాన్ని 2022 జూన్ వరకూ ప్రభుత్వం పొడిగించింది. ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధుల్లో ఉండాలని స్పష్టం చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజూ ఉద్యోగుల హాజరును పరిశీలించాలని ఆయా శాఖల కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 10 గంటల 10 నిముషాల అనంతరం విధులకు హాజరైతే ఆలస్యంగా వచ్చినట్లు పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొంది. నెలలో మూడు సార్లు మాత్రమే ఆలస్య హాజరు అనుమతిస్తామన్నారు. ఆ తర్వాత వేతనాల్లో కోత విధిస్తామని స్పష్టం చేసింది. 


Also Read: తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి