JanaSena YouTube channel Hacked: అమరావతి: జనసేన పార్టీకి చెందిన అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాకయింది. అసలే ఎన్నికల టైమ్ కావడంతో పార్టీకి సంబంధించిన వీడియోలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సభలు, సమావేశాలు ఉండటంతో పార్టీ యూట్యూబ్ ఛానల్ యాక్టివ్‌గా ఉంది. ఈ క్రమంలో కొందరు హ్యాకర్లు జనసేన యూట్యూబ్ ఛానల్ ను టార్గెట్ చేసి హ్యాక్ చేశారు. జనసేన వీడియోలను తొలగించిన హ్యాకర్లు బిట్ కాయిన్ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. జనసేన యూట్యూబ్ ఛానల్ పేరు తొలగించి, మైక్రో స్ట్రాటజీ అని పేరు మార్చేశారు హ్యాకర్లు. 






సాధారణ సమయంలోనే రాజకీయ పార్టీల అధికారిక సోషల్ మీడియా ఖాతాలతో పాటు రాజకీయ నాయకుల సోషల్ అకౌంట్లు సైతం హ్యాకింగ్ కు గురయ్యేవి. అసలే ఎన్నికల సమయం కావడంతో పార్టీలు, నేతలు జాగ్రత్తగా ఉంటున్నారు. ఏ క్షణంలో ఏ పార్టీకి చెందిన ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ అకౌంట్లు హ్యాకింగ్ బారిన పడతాయో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మరోవైపు కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. గత నెలలోనే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్.. ఉగాది తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.


ఆదివారం (ఏప్రిల్ 14) సాయంత్రం 4: 00 గంటలకు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో నిర్వహించనున్న వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. వారాహి విజయభేరి పేరుతో పవన్ సభలు నిర్వహించి ప్రసంగిస్తున్నారు. తన నియోజకవర్గం పిఠాపురంలో ఐదు రోజులపాటు ప్రచారం నిర్వహించారు. పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్ ప్రచారం చేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నారు.