BJP leaders are also joining Congress party  : లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతూండటంతో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ నేతలే కాంగ్రెస్ లో చేరుతూ వస్తున్నారు. తాజాగా  బీజేపీ నియోజకవర్గ ఇంచార్జులను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు. 


కాంగ్రెస్‌లో చేరిన సంగారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ 


భారతీయ జనతా పార్టీకి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి పులి మామిడి రాజు హస్తం గూటికి చేరారు.   శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తో కలిసి వచ్చారు.   సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పులి మామిడి రాజుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చేవారికి వెల్కమ్ చెబుతుందన్నారు. బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరిన పులి మామిడి రాజును సీఎం అభినందించారు. బీజేపీ తరపున పోటీ చేసిన పులిమామిడి రాజు 21 వేల ఓట్లను తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. 


 





 


కాంగ్రెస్‌లో చేరిన మక్తల్ ఇంచార్జ్ జలంధర్ రెడ్డి 
  
మక్తల్ నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం రోజు రాత్రి బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన   మాజీ ఎంపీ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిల ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌కు కాంగ్రెస్ కండువా కప్పి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు .పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాదిరెడ్డి జలంధర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ స్థానానికి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు . 


 





 


బీజేపీ అంతర్గత రాజకీయాలతో పలువురు రాజీనామాలు


పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా పలువురు రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టిక్కెట్ దక్కని కారణంగా జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మహబూబ్ నగర్ వ్యాప్తంగా పరిచయాలు ఉండటం, తన అనుచరుల్ని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపు మరికొంత మందిని చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.