Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా వైఎస్ కథా చిత్రంలో ఇప్పుడు చూస్తున్న ట్విస్ట్‌లు గతంలో ఏ సినిమాలో కూడా చూసి ఉండరేమో. లేటెస్ట్ టర్న్ కూడా ఎవరూ ఊహించనిది.అదే వైఎస్ విజయమ్మ అమెరికా టూర్.
రాజకీయాల్లో ఉన్న హేమాహేమీలు టూర్‌లకు వెళ్లడం సర్వసాధారణం. కానీ విజయ అమెరికా టూర్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. అసలే ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పీక్స్‌లో ఉంది. అలాంటి టైంలో విజయ అమెరికాకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
2019 ఎన్నికల్లో ఐక్యంగా ఉన్న వైఎస్ కుటుంబం తర్వాత పరిణామాలతో చీలిపోయిది. అన్న జగన్‌తో విభేదించిన షర్మిల ముందు తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్న షర్మిలకు వైఎస్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా లభిస్తోంది. తన తండ్రి హత్యకు కారణమైన దోషులను శిక్షించడంలో విఫలమయ్యారన్న కారణంతో జగన్‌ను వ్యతిరేకిస్తున్నారు సునీత. అంటే వైఎస్ ఫ్యామిలీకి చెందిన ఇద్దరు సోదరీమణులు జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
ఒకవైపు కుమారుడు, మరోవైపు కుమార్తె ఇద్దరూ చెరో దారిలో వెళ్తున్న టైంలో తల్లి విజయమ్మ సపోర్ట్ ఎవరికి ఉంటుందనే ఆసక్తి అందరిలో కనిపించింది. తెలంగాణ రాజకీయాల్లో ఉన్నప్పుడు షర్మిలకు తల్లిగా విజయ సపోర్ట్ చేశారు. ఏపీ రాజకీయాల్లో ఆమె వచ్చిన తర్వాత విజయ సైలెంట్ అయిపోయారు.
గత ఎన్నికల్లో కుమారుడు జగన్ విజయం కోసం కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగిన విజయమ్మ ఈసారి మద్దతు ఇచ్చేందుకు ఓకే చెప్పలేదని టాక్ నడుస్తోంది. అభ్యర్థుల ప్రకటన టైంలో ఆయనను ఆశీర్వదించిన విజయ తర్వాత ఎక్కడా రాజకీయ వేదికలపై కనిపించలేదు. అయితే షర్మిల, సునీత నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్‌గా ప్రచారం చేయాలనే ఒత్తిడి విజయమ్మపై ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో నడుస్తోంది. దీనిపై ఎవరూ బహిరంగంగా మాట్లాడింది లేదు. కానీ పొలిటికల్ సర్కిల్‌లో మాత్రం ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
కుమార్తెగా తనకూ సపోర్ట్ కావాలని షర్మిల కూడా విజయమ్మను కోరుతున్నట్టు సమాచారం. జగన్‌ను ఆశీర్వదించినట్టే కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల సందర్భంగా కూడా షర్మిలను విజయమ్మ ఆశీర్వదించారు. బహిరంగంగా షర్మిలకు మద్దతు ఇస్తూ జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు మాత్రం ఆమె ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారం కీలక దశకు వచ్చింది. ఈ టైంలో విజయమ్మ ఎవరి పక్షాన నిలుస్తారనే చర్చ జరుగుతున్న సమయంలో ఆమె ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఎన్నికలతో సంబంధం లేదన్నట్టు ఆమెరికా వెళ్లిపోయారు. ఆమె అమెరికా చేరే వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. షర్మిల కుమారుడు, కోడలు, కుమార్తెతో కలిసి అమెరికాలో ఉన్నారు.
విజయమ్మ అమెరికా వెళ్తూ వెళ్తూ తన సపోర్ట్ ఎవరికో చెప్పకనే చెప్పారు అంటున్నారు షర్మిల వర్గీయులు. షర్మిల ఫ్యామిలీతో వెళ్తున్నారంటే విజయమ్మ సపోర్ట్ వారికే ఉన్నట్టు అర్థం చేసుకోవాలనే వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. దీన్ని కొట్టిపారేస్తున్నారు జగన్ సపోర్టర్స్. ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండేందుకే ఆమె అమెరికా వెళ్లిపోయారని ఇందులో కూడా రాజకీయాలు చేయడం సరికాదని సలహా ఇస్తున్నారు. ఏమైనా సరే ఎన్నికలు పూర్తయై ఏదో ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు మాత్రం విజయమ్మ అమెరికాలోనే ఉంటారని టాక్ నడుస్తోంది.