Bandi Sanjay Confident over NDA win 400 seats: కరీంనగర్: క్రికెట్ లో ఐపీఎల్ తరహాలోనే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (IPL)  మ్యాచ్ నడుస్తోందని, నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం 400ల స్థానాలతో  హ్యాట్రిక్ కొట్టనుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో I.N.D.I.A కూటమిని ఎన్డీఏ టీమ్ చిత్తుగా ఓడిస్తుందని జోస్యం చెప్పారు. కేంద్రంలో మాదిరిగానే రాష్ట్ర రాజకీయాల్లోనూ తెలంగాణ పొలిటికల్ లీగ్ ఆట మొదలైందన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో 17 మంది సభ్యుల టీం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ గుంట నక్కల్ని ఓడించడం తథ్యమన్నారు.


చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై 
కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్ లో శనివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ‘బూత్ విజయ సంకల్ప్ అభియాన్’ సమావేశం జరిగింది. చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటైనయ్... అయినా 2 పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి టీపీఎల్ కప్ ను గెలిచి, ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అతి తక్కువ వ్యవధిలో కాంగ్రెస్ అత్యంత ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక పార్టీగా నిలిచిందన్నారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల రాశులు పోసినా కొనడం లేదని, తాలు, తరుగు పేరుతో దోచుకునేందుకు దళారులు సిద్ధమైనా సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీల అమలు అని తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. 


తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) గేమ్ 
దేశమంతా క్రికెట్ లో ఐపీఎల్ జోష్ నడుస్తోంది. రాజకీయాల్లోనూ ఇండియా పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోంది. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన ఎన్డీఏ టీమ్ I.N.D.I.A కూటమి టీమ్ ను చిత్తుగా ఓడించి 400 పాయింట్లతో కప్ గెలవబోతోంది. ఇక్కడ తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) గేమ్ మొదలైంది. ఇందులో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి టీంలో బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాధవీలత, గోమాస శ్రీనివాస్, కొండా వెంకటేశ్వర్ రెడ్డి, బీవీ పాటిల్, సైదిరెడ్డి, వినోద్ రావు, బూర నర్సయ్యగౌడ్, నగేశ్, భరత్ సహా 17 మంది సభ్యులం ఉన్నాం. కాంగ్రెస్ కు ఇంకా ఆటగాళ్లే దొరకడం లేదు. బీఆర్ఎస్ కు టీమ్ సభ్యులున్నా నిరాశలో ఉన్నారు. - బండి సంజయ్ 


6 గ్యారంటీలు అమలు చేశారా? 
వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు మోసం చేశారు.. రైతులు అరిగోస పడుతున్నరు. పంట నష్టం రాకపోగా.. ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రాశులు పోసినా కొనే నాధుడు లేడు. దళారులు దోచుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు.. వడ్లకు కనీస మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. రూ.3 లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని దగా చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోవడంతో రైతులను బ్యాంకర్లు డిఫాల్టర్లుగా ప్రకటించాయి. మహిళలకు మహాలక్ష్మీ పథకంతో రూ.2,500లు ఇస్తామని చెప్పిన హామీ నెరవేర్చలేదు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ అని నమ్మించి మోసం చేశారు. అర్హులైన పేదలకు జాగాతోపాటు రూ.5 లక్షల నగదు సాయం చేస్తామన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇవ్వలేదు. రైతులకు ఎకరాకు రూ.15 వేల భరోసా అందడం లేదు.   - బండి సంజయ్ 


‘కరీంనగర్ పార్లమెంట్ కోసం రూ.12 వేల కోట్లకుపైగా తీసుకొచ్చి ప్రధానితో జాతీయ రహదారుల విస్తరణ పనులు ప్రారంభించాం. తమ వల్లే అని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణానికి నాటి BRS ప్రభుత్వం నిధులియ్యకుంటే... సేత బంధన్ స్కీం ద్వారా కేంద్రం నుంచి మొత్తం నిధులు తీసుకొచ్చాను. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ నేతలు కొబ్బరికాయ కొట్టారు. స్మార్ట్ సిటీ నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చిన ఘనత బీజేపీదే. కరీంనగర్ లో చేసిన అభివృద్ధిపై బుక్ లెట్ ముద్రించి ఇంటింటికీ పంపిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ శ్వేతపత్రం కావాలంటున్నారు. బీఆర్ఎస్ పై మేం పోరాడితే కాంగ్రెస్ ఫలాలు అనుభవిస్తోందని’ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.