Ankapalli District collector suspends Volunteers for Election Campaign: చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్లు ఈసీ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష నేతలు గత కొన్ని నెలల నుంచి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిని చిత్తూరు జిల్లా కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చీకటపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఎం వెంకటేష్, కుప్పం మండలం టెక్నికల్ అసిస్టెంట్ జి.మురగేష్ లను జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్ విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు.  


అనకాపల్లి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వాలంటర్లపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఆ ఇద్దరు వాలంటీర్లను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేతలు వారితో ప్రచారం చేయిస్తున్నారా, లేక వీరికి ఎన్నికల ప్రచారం పని అప్పగించిన ఉన్నతాధికారుల వివరాలపై ఈసీ ఆరా తీస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అదే రోజు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లతో ఎన్నికల ప్రచారం చేయించవద్దని, వారికి ఎన్నికల విధులు సైతం అప్పగించేది లేదన్నారు.


ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లు! 
ఏపీ ప్రభుత్వం నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసీ ఆదేశాలను ఏపీలో వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. పైగా ఇంటింటి ప్రచారానికి వెళ్లి వైఎస్ జగన్‌కు, వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తుండటంతో స్థానికులు షాకవుతున్నారు. జగనన్నను గెలిపించుకోవాలని తాము ప్రచారం చేస్తున్నామంటూ ప్రచారానికి వెళ్లిన వాలంటీర్లు బహిరంగంగానే చెబుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ప్రభుత్వం అందించిన పథకాలు, చేస్తున్న సంక్షేమం గురించి వాలంటీర్లు ప్రచారం చేయవచ్చు కానీ, పలానా పార్టీకి, పలానా నేతలకు ఓటు వేయాలని ప్రచారం చేసే హక్కు మీకు లేదంటూ వాలంటీర్లను స్థానికులు నిలదీశారు. ఏ కుటుంబానికి ఎంత లబ్ది జరిగిందో చెప్పడంతో పాటు, ఫోన్‌ ద్వారా లబ్దిదారుల ఫొటోలు తీసి, సేవ్ చేస్తున్నారు. కలెక్టర్ దృష్టికి రావడంతో ఆ ఇద్దరు వాలంటీర్లను సస్పెండ్ చేశారు.