Deputy CM Pawan Kalyan Anger On Fans And Police In Tirupati: 'మీకు బాధ్యత లేదా.?', 'ఇది ఆనందించే సమయమా.?' అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఆయన గురువారం స్విమ్స్ ఆస్పత్రికి వచ్చారు. బాధితులను పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన కారు ఎక్కబోతుండగా అభిమానులు కేరింతలు, ఈలలతో హల్చల్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్.. 'ఇది ఆనందించే సమయమా.. అవతల మనుషులు చచ్చిపోయారు. బాధ అనిపించడం లేదా మీకెవ్వరికీ.?. ఇక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు.? వారిని కంట్రోల్ చేయండి.. బాధ్యతారాహిత్యంతో వ్యవహరించొద్దు.' అంటూ వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


సంచలన వ్యాఖ్యలు


అటు, ఈ ఘటనపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిన దుర్ఘటనకు మనస్ఫూర్తిగా యావత్ జాతికి పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారని వెల్లడించారు. ఇలాంటివి జరకుండా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 'ఎప్పుడో ఇవ్వాల్సిన టికెట్ల కోసం ప్రజలను ఎందుకు నిల్చోబెట్టారో విచారణ చేయాలి. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయి. ముఖ్యమంత్రి సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే అధికారులు, టీటీడీ అధికారులు, టీటీడీ పాలకమండలి, ఈవో, అదనపు ఈవో వెంకయ్య చౌదరి బాధ్యత తీసుకోవాలి. వీఐపీ యాటిట్యూడ్ మానేయండి. ఆలయాల్లో వీఐపీ కల్చర్ పెరిగిపోయిందని అందరూ చెబుతున్నారు. మనకు కావాల్సింది వీఐపీ ఫోకస్ కాదు. సామాన్యుడు భక్తులు వచ్చి క్షేమంగా ఇంటికి చేరేలా ఏం చర్యలు తీసుకుంటున్నారు. ఈ దృష్టితో ఆలోచించకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా ఈవో, ఏఈవో, పాలక మండలి, ఛైర్మన్ మేల్కొని ఇలాంటివి జరగకుండా చూడాలి.' అని స్పష్టం చేశారు.


అధికారులపై చర్యలు 


మరోవైపు, తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం జ్యూడీషియల్ విచారణకు ఆదేశించింది. తిరుపతి SP సుబ్బారాయుడు, జాయింట్ కమీషనర్ గౌతమిలపై సీఎం చంద్రబాబు బదిలీ వేటు వేశారు. DSP రమణ కుమార్ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ శ్రీధర్ ను కూడ బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు బాధ్యతగా పని చేయాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.


కేసులు నమోదు


కాగా, తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించారని భక్తులు అపోహపడి ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని తిరుపతి తూర్పు పీఎస్‌లో టోకెన్ల జారీ కేంద్రం ఇంఛార్జీ, నారాయణవనం తహసీల్దార్ జయరాములు ఫిర్యాదు చేశారు. అలాగే, తమిళనాడుకు చెందిన భక్తురాలు క్యూలైన్‌లోకి వెళ్లే సమయంలో అనారోగ్యంతో కింద పడిపోయారు. ఆమెను రుయా ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని.. ఇందుకు మల్లిక అనారోగ్యం కూడా తోడైందని.. టోకెన్ల జారీ కేంద్రం ఇంఛార్జీ, బాలాయపల్లి తహసీల్దార్ పి.శ్రీనివాసులు కంప్లైంట్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Also Read: YS Jagan: వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?