ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమంలో చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఆందోళనల్లో ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పేరడీ పాటలు పాడుతున్నారు. పిట్ట కథలు చెబుతున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూండటంతో  మంత్రులు మండిపడుతున్నారు. టీచర్లు ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో మీడియా సమావేశం పెట్టి టీచర్ల తీరుపై మండిపడ్డారు. 


Also Read: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 8 నుంచి 8.5 శాతం వృద్ధి రేటు.. ఆర్థిక సర్వేలో ఏముందంటే..


ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పే టీచర్లు లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నారని .. కానీ వారు తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారని మండిపడ్డారు. వారు చెప్పే చదువు వారి పిల్లలకు కూడా ఉపయోగపడదా అని ప్రశ్నించారు. టీచర్లు సరిగ్గా పని చేస్తే తమ పిల్లల్ని కూడా ఎందుకు ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించరనేది నారాయణ స్వామి సందేహం. పిల్లలకు చదువు చెప్పి మంచి విద్యాబుద్దులు నేర్పేవారు ప్రభుత్వం, సీఎం జగన్‌పై అలాంటి మాటలు మాట్లాడరని అన్నారు. 


Also Read: మాటలు రావా.. మాట్లాడలేమా? ఉద్యోగ నేతలపై మంత్రి బొత్స ఆగ్రహం !


ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైన వృత్తి అని చెప్పిన మంత్రి.. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా? అని మండిపడ్డారు. సీఎం జగన్ గురించి టీచర్స్ వాడిన భాష సరైంది కాదన్నారు. టీచర్ల పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్నారా? అని మంత్రి ప్రశ్నించారు.  టీచర్లు తమ సమస్యలను ముఖ్యమంత్రిని కలిసి చెబితే పరిష్కరించేవారని.. కనీసం చర్చలు జరిపి పరిష్కరించుకోవాలన్నారు. అలా రోడ్డెక్కి నిరసనలు తెలపడం కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు సహకరించాలని నారాయణ స్వామి గుర్తు చేశారు. 


Also Read: అప్పుడు పట్టించుకోలేదు అందుకే ఇప్పుడీ పరిస్థితి... రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు


ఉద్యోగులు - ప్రభుత్వం మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం మోసం చేసిందని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. చర్చలకు పిలిచి అవమానించారని అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ వలన ఉద్యోగులకు రూ.10,500 కోట్ల మేర లబ్ది చేకూరుతుందని.. జీతాలు పెరుగుతాయని  చెబుతోంది. తమ డీఏలు, హెచ్ఆర్ఏ, పాత బకాయిలు కలపి జీతం పెరుగుతోందని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఉద్యోగులు మండి పడుతున్నారు. ఆ రూ. పదివేల ఐదు వందల కోట్లు ప్రభుత్వమే ఉంచుకుని తమకు పాత జీతాలు చెల్లించాలంటున్నారు.