రిలయన్స్ జియో ఇటీవలే మనదేశంలో జియో ఫోన్ నెక్ట్స్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కంపెనీ 5జీ ఫోన్ కూడా లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. దీనికి జియో ఫోన్ 5జీ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఈ సంవత్సరమే మనదేశంలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
జియో ఫోన్ 5జీ లాంచ్ తేదీ
ఈ ఫోన్ మనదేశంలో ఈ సంవత్సరం లాంచ్ కానుంది. అయితే కచ్చితంగా ఎప్పుడు లాంచ్ కానుందనే సమాచారం మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. జియో ఇంకా మనదేశంలో 5జీ నెట్‌వర్క్‌ను కూడా అందుబాటులోకి తీసుకురాలేదు.
జియో ఫోన్ ధర (అంచనా)
ఈ ఫోన్ ధర తక్కువగానే ఉండనుందని తెలుస్తోంది. రూ.9,000 నుంచి రూ.12,000 మధ్యలో ఈ ఫోన్ ధర ఉండనుందని వార్తలు వస్తున్నాయి. మనదేశంలో ఇది అత్యంత చవకైన 5జీ ఫోన్ కానుంది.
జియో 5జీ కవరేజ్
రిలయన్స్ మనదేశంలో మొదట 1,000 నగరాల్లో 5జీ కవరేజ్‌ను ప్లాన్ చేస్తుంది. అతి త్వరలోనే 5జీ సేవలను జియో ప్రారంభించడానికి ఈ ప్లానింగ్ ఉపయోగపడనుంది. 5జీ స్పెక్ట్రంకు సంబంధించిన వేలం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో జరగనుంది.
జియో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇప్పటివరకు వచ్చిన లీకైన వివరాల ప్రకారం.. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1600 x 720 పిక్సెల్స్‌గా ఉండనుంది. ఫోన్ అంచులు కొంచెం సన్నగా ఉండనున్నాయి. హోల్ పంచ్ కటౌట్ కూడా ఇందులో అందించనున్నారు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ ఎన్3, ఎన్5, ఎన్28, ఎన్40, ఎన్78 5జీ బ్యాండ్లను ఇది సపోర్ట్ చేయనుంది. జియో ఫోన్ లాంచ్ అయ్యే నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రావాలని జియో పనిచేస్తుంది.
4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఈ స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుందని, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుందని వార్తలు వస్తున్నాయి.