AP Govt Ex-gratia To Sai Teja Family: సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు ప్రయాణిస్తూ హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.






హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ ఆయన సతీమణి సహా 13 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో అమరుడైన చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ పార్థీవదేహాన్ని ఎట్టకేలకు గుర్తించారు. అతడి కుటుంబసభ్యుల శాంపిల్స్ తీసుకెళ్లిన టీమ్ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి నేడు ఆరుగురు జవాన్ల భౌతికకాయాలను గుర్తించింది. నేటి రాత్రి బెంగళూరుకు సాయితేజ భౌతికకాయాన్ని తరలించి, రేపు స్వగ్రామానికి తీసుకెళ్లనున్నారు. ఆదివారం సాయితేజ అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన సోదరుడు వెల్లడించారు.






సాయితేజ సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిగా సేవలు అందించారు. బుధవారం నాడు తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కూలిన విషాద ఘటనలో తెలుగు తేజం సాయితేజ ప్రాణాలు కోల్పోయారు. అయితే డెడ్ బాడీస్ చెల్లాచెదురు కావడంతో డీఎన్ఏ టెస్టులు జరిపి జవాన్ల భౌతికకాయాలు గుర్తించాల్సి రావడంతో అంత్యక్రియలకు జాప్యం తలెత్తింది. నేటి ఉదయం సాయితేజతో పాటు మొత్తం ఆరుగురు జవాన్ల భౌతికకాయాలను డీఎన్ఏ ద్వారా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి బెంగళూరుకు సాయితేజ పార్థీవదేహాన్ని తరలించేందుకు ఆర్మీ ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఎగువరేడులో అధికార లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read: Lance Naik Sai Teja: చిత్తూరుకు చెందిన సాయితేజ భౌతికకాయం గుర్తింపు.. నేడు స్వగ్రామానికి తరలిస్తున్న అధికారులు
Also Read: Gen Bipin Rawat's funeral : త్రిదళాధిపతికి భారత ప్రజల కన్నీటి వీడ్కోలు - 17గన్ సెల్యూట్ సమర్పించిన సైన్యం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి