హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన కమల పాలిక్లీనిక్‌ చాలా ఫేమస్. ఆ జిల్లాలో ఎవర్ని అడిగినా దీని గురించి చెప్తారు. పేరుకే పాలిక్లినిక్ కానీ... అక్కడ ఎలాంటి రోగానికైనా వైద్యం చేస్తారు. ఆ క్లీనిక్‌కు వెళ్లి చూస్తే చాలా మంది డాక్టర్ల పేర్లు కనిపిస్తాయి. డాక్టర్ బి. స్వప్న బీఏఎంఎస్, డాక్టర్ శ్రీనివాస్ ఎంబీబీఎస్, డీజీఓ డాక్టర్ తరుణ్ ఇలా చాలా మంది పని చేస్తున్నట్టు బయటకు కలరింగ్ ఇస్తుంటారు. లోపలికి వెళ్తే మాత్రం ఒకే వ్యక్తి అన్ని రకాల వ్యాధులకు వైద్యం చేస్తుంటారు. అతనే సమ్మయ్య. 
ఈ క్లీనిక్‌కు కర్త, కర్మ, క్రియ అన్ని సమ్మయ్య. స్థానికంగా ఆర్‌ఎంపీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమ్మయ్యకు వచ్చిన ఆలోచనే ఈ క్లీనిక్. ఐడియా వచ్చిన తడువుగానే క్లీనిక్‌ ఏర్పాటు చేసి జనాలను ముంచడం మొదలు పెట్టాడు. సంతాన సాఫల్య కేంద్రం పేరుతో జనాల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. అక్కడే డెలివరీలు చేసేవాడు.


సమ్మయ్య విద్యార్హత ఏంటో తెలియదు. కానీ సెమెన్ అనాలసిస్, హెచ్ఐవీ వంటి టెస్టులు రాసేస్తాడు. ఎంతో నైపుణ్యతతో ఇవ్వాల్సిన ఇంట్రా వెజైనల్ ఇంజక్షన్లు కూడా ఇచ్చేస్తుంటాడీ వ్యక్తి. ఇన్నాళ్లూ గుట్టుగా సాగిన దందా సంగతి ఇన్నాళ్లకు అధికారుల చెవిన పడింది. ఆర్ఎంపీ సమ్మయ్య అర్హత లేకున్నా వైద్యం చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్, వైద్య, ఆర్యో శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సమ్మయ్య క్లీనిక్‌పై నిఘా పెట్టారు. డీసీపీ, DMHO ఆదేశాల మేరకు మూడు రోజులుగా క్లీనిక్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు టైం కోసం చూసి దాడులు నిర్వ హించారు.

అధికారులు చేసిన దాడుల్లో ఎలాంటి అర్హతలు లేకుండా సమ్మయ్య తన క్లీనిక్‌లో సంతానం కోసం వచ్చిన వారికి ఆపరేషన్లు, అబార్షన్లు, వైద్యం చేస్తున్నట్లు తేలింది. చట్ట ప్రకారం ఆర్ఎంపీ వైద్యు లు ఎలాంటి టెస్టులు రాయకూడదు. అయినప్పటికీ సమ్మయ్య సెమెన్ అనాలసిస్, హెచ్ఐవీ వంటి టెస్టులను పేపర్లపై రాసి చేయిస్తున్నాడు. వచ్చిన రిపోర్టుల ప్రకారం ఇంట్రా వెజైనల్ ఇంజక్షన్లు కూడా ఇస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీనిపై లోతుగా విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు.
ఇన్నాళ్లూ వైద్యం పేరిట ప్రజలను నిలువునా మోసం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సమ్మయ్య ఆట కట్టింది. 


Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి