Jagananna Vasathi Deevena Funds: సంక్షేమ పాలనకే మొగ్గుచూపిన ఏపీ ప్రభుత్వం నేడు జగనన్న వసతి దీవెన రెండో విడత సాయాన్ని విడుదల చేయనుంది. నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాలలో పర్యటించనున్నారు. నంద్యాలలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని.. రాష్ట్ర వ్యాప్తంగా 10.68 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లను జమ చేయనున్నారు. సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కగానే అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు.


నంద్యాల ఎస్‌పీజీ గ్రౌండ్‌ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 2021–22 విద్యా సంవత్సరానికి జగనన్న వసతి దీవెన రెండో విడత కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ రూ.1,024 కోట్లు జమ చేస్తారు.  ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. పేదరికంతో ఏ విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఆలోచనతోనే విద్యార్థుల భోజన, వసతి ఖర్చులను ఏపీ ప్రభుత్వం చెల్లిస్తోంది. 


తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ
ప్రతి ఏడాది జగనన్న వసతి దీవెన పథకం కింద రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, వైద్య, తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను సైతం ఏపీ ప్రభుత్వం భరిస్తోంది. ఈ నగదును విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు.


తండ్రి వైఎస్సార్ బాటలో సీఎం జగన్..
తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ బాటలో సీఎం జగన్ నడుస్తున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆనాడు సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ లాంటి పథకాలు తీసుకొచ్చి ఎంతో మంది పేద విద్యార్థులని డాక్టర్లు, ఇంజినీర్లు చేయగా.. నేడు వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి విద్యార్థులకు భోజనం, వసతి ఖర్చులను సైతం అందిస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తాలను ఏపీ ప్రభుత్వం జమ చేస్తోంది. జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌ –డిసెంబర్, 2021 త్రైమాసికానికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.709 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేశారు. నేడు మరో రూ.1,024 కోట్లు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి.


Also Read: Rama Navami 2022: శ్రీరామనవమి నాడు విచిత్రమైన పరిస్థితి - మంత్రులు లేని సీఎంగా వైఎస్ జగన్


Also Read: Lucky Five : ఆ ఐదుగురు ఎవరు ? జగన్‌ కేబినెట్‌లో కొనసాగే వారెవరు ?