ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం లక్నో 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. క్వింటన్ డికాక్ (80: 52 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అదరగొట్టిన లక్నో బౌలర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం లభించింది. యువ ఓపెనర్ పృథ్వీ షా (61: 34 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) చెలరేగి ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. వీటిలో మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌వి కేవలం మూడు పరుగులే. పృథ్వీ షా అర్థ సెంచరీ చేసే సమయానికి వార్నర్ స్కోరు కేవలం నాలుగు పరుగులు మాత్రమే. దీన్ని పృథ్వీ షా ఎంత వేగంగా ఆడాడో బట్టి అర్థం చేసుకోవచ్చు.
అయితే ఆ తర్వాత ఢిల్లీ కష్టాల్లో పడింది. పృథ్వీ షాను కృష్ణప్ప గౌతమ్, డేవిడ్ వార్నర్‌ను (4: 12 బంతుల్లో) రవి బిష్ణోయ్ వరుస ఓవర్లలో అవుట్ చేశారు. మరో ఓవర్ వ్యవధిలోనే వన్ డౌన్ బ్యాటర్ రొవ్‌మన్ పావెల్ (3: 10 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 74 పరుగులు మాత్రమే.
ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కెప్టెన్ రిషబ్ పంత్ (39 నాటౌట్: 36 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (36: 28 బంతుల్లో, మూడు ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ అభేద్యమైన మూడో వికెట్‌కు 57 బంతుల్లో 75 పరుగులు జోడించారు. అయితే చివరి మూడు ఓవర్లలో వీరిని లక్నో బౌలర్లు విజయవంతంగా అడ్డుకున్నారు. ఈ మూడు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే రావడం విశేషం. ఒక్క బౌండరీని కూడా పంత్, సర్ఫరాజ్ సాధించలేకపోయారు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులకు పరిమితం అయింది. ఢిల్లీ బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీయగా... కృష్ణప్ప గౌతంకు ఒక వికెట్ దక్కింది.
డికాక్ షో...
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఇన్నింగ్స్ మెల్లగా మొదలైంది. కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ (24: 25 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా ఆడలేకపోయాడు. మరోవైపు మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ బౌండరీలు కొడుతూ స్కోరును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 73 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ 10వ ఓవర్లో రాహుల్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఎవిన్ లూయిస్ (5: 13 బంతుల్లో) కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేదు. ఎవిన్ లూయిస్ అవుటైన మూడు ఓవర్లకే క్వింటన్ డికాక్ కూడా అవుట్ కావడంతో లక్నో కష్టాల్లో పడింది.
అయితే కొట్టాల్సిన స్కోరు తక్కువే ఉండటంతో దీపక్ హుడా (11: 13 బంతుల్లో), కృనాల్ పాండ్యా (19 నాటౌట్: 14 బంతుల్లో, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. చివర్లో దీపక్ హుడా అవుటైనా ఆయుష్ బదోని (10 నాటౌట్: 3 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఫోర్, సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.