ipl 2022 what if mumbai indians chennai superkings lost 3 more matches : టీ20 అంటేనే గమ్మత్తైన ఆట! ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. గెలిచే జట్టు సడెన్‌గా ఓడిపోతుంది. ఇక పనైపోయిందనుకున్న ఆటగాడు సూపర్ హిట్టవుతాడు. అంచనాలు ఎక్కువగా ఉన్న క్రికెటర్ అట్టర్ ఫ్లాప్ అవుతుంటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL) అత్యుత్తమ ఫ్రాంచైజీలు, ఛాంపియన్లుగా నిలిచిన జట్లు ఈ సీజన్లో ఇప్పటి వరకు గెలుపు ఖాతా తెరవక పోవడం చూస్తుంటే ఇదే అనిపిస్తోంది.
ముంబయి ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings). ఇండియన్ ప్రీమియర్ లీగులోనే అత్యంత విజయవంతమైన జట్లు. ముంబయి (MI) ఐదు సార్లు ఛాంపియన్‌గా అవతరిస్తే చెన్నై నాలుగు సార్లు ట్రోఫీ అందుకుంది. ఈ రెండు జట్లకు అద్భుతమైన కెప్టెన్లు ఉన్నారు. రోహిత్ (Rohit Sharma), ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వానికి తిరుగులేదు. కానీ ఐపీఎల్ 2022 (IPL 2022) మెగా వేలం తర్వాత ఈ రెండు జట్లు మునుపటి స్థాయిలో లేవనిపిస్తోంది. మిడిలార్డర్, బౌలింగ్, ఆటగాళ్ల ఎంపికలో పొరపాట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచులు ఓడిన ఈ ఛాంపియన్ జట్లు మరో 3 మ్యాచుల్లో ఓడితే ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.
భీకరమైన హిట్టర్లు, గెలుపు గుర్రాలకు ముంబయి ఇండియన్స్ నిలయం. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిందంటేనే ముంబయి సత్తా అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఐపీఎల్ 2022లో రోహిత్ సేన మూడు మ్యాచులు ఆడి మూడింట్లోనూ ఓడింది. సాధారణంగా హిట్‌మ్యాన్ జట్టుకు తొలి మ్యాచ్ ఓడిపోయే సంప్రదాయం ఉంది. అంతవరకు ఫర్వాలేదు. సెంటిమెంటు అనుకోవచ్చు. మరోవైపు సీఎస్‌కే పగ్గాలను జడ్డూ అందుకున్నాడు. మిడిలార్డర్, బౌలింగ్, ఓపెనింగ్ ఇబ్బందులు వారిని ఓడిస్తోంది. కానీ పది జట్లకు పెరిగిన లీగులో వరుసగా మూడు ఓడిపోవడం ఆ జట్ల ప్లేఆఫ్ అవకాశాలను కచ్చితంగా దెబ్బతీస్తుంది. 14 లీగు మ్యాచుల్లో 3 ముగిశాయంటే ఇంకా మిగిలింది 11. ఇందులో అన్నీ గెలుస్తారని చెప్పలేం. 50-50 ప్రాబబిలిటీతో లెక్కేసినా గెలిచేవి ఐదు లేదా ఆరు.
ఒకప్పుడు ఐపీఎల్‌లో 8 జట్లే ఉండేవి. అప్పుడు బాగా ఆడకపోయినా, ఇతర జట్లతో సమానమైన పాయింట్లు ఉన్నా రన్‌రేట్ కీలకంగా మారేది. పది జట్లకు పెరిగిన తర్వాత అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం తక్కువే. అలాంటప్పుడు 10 లేదా 12 పాయింట్లతో ప్లేఆఫ్ విమానం అస్సలు ఎక్కలేరు. 14 పాయింట్లు సాధించినా ఈ సారి ప్లేఆఫ్ అవకాశాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఉంది. రాజస్థాన్ (RR), కోల్‌కతా (KKR) సరికొత్తగా కనిపిస్తున్నాయి. కొత్త జట్లు గుజరాత్ (GT), లక్నో (LSG) దుమ్మురేపుతున్నాయి. దిల్లీ (DC), బెంగళూరు (RCB)ను అస్సలు తక్కువ అంచనా వేయలేం. ఇప్పటికే పాయింట్ల ఖాతా తెరచి నిలకడగా రాణిస్తున్న వీరితో పోటీపడటం ముంబయి, చెన్నైకి సులభం కాదు.
పైగా రోహిత్ కోరుకున్న ఆటగాళ్లను ముంబయి ఇవ్వడం లేదని ఓ టాక్ నడుస్తోంది. వేలం సమయంలో అతడిని సంప్రదించలేదని, అతడి అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదనీ అంటున్నారు. మిడిలార్డర్, డెత్ ఓవర్లలో ముంబయి విఫలం అవుతోంది. బ్యాటింగ్‌లోనూ ఊపులేదు. ఇక అద్భుతమైన వ్యూహకర్తగా పేరున్న ధోనీ వేలంలో ఇండియన్ పేసర్లను కొనుగోలు చేయకపోవడం విస్మయకరం. శార్దూల్ లోటు పూడ్చుకోలేనిది. ఇక దీపక్ చాహర్ వచ్చేంత వరకు కుర్ర పేసర్లనే ఉపయోగించుకోవాలి. వారినేమో ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఈ రెండు జట్లు మరో 3 మ్యాచులు ఓడాయంటే ఎవ్వరేం చేయలరు.
చివరగా ఒక్క మాట! ముందుగానే చెప్పుకున్నాం. క్రికెట్ గమ్మత్తైన ఆట. వీరిలో ఏదైనా ఒక జట్టు వరుసగా అన్ని మ్యాచులు గెలిచినా ఆశ్చర్యం లేదు. చాలాసార్లు ముంబయి మొదట్లో ఓడిపోయి తర్వాత ప్లేఆఫ్‌కు వచ్చి ఫైనళ్లు గెలిచింది. కానీ సీఎస్‌కే ఎప్పుడూ అలా చేయలేదు. ఒకసారి జోష్ పోయిందంటే, గతి తప్పిందంటే మళ్లీ మూమెంటమ్ తీసుకురావడం కష్టం.