ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులందరి రాజీనామాలు తీసుకున్నారు. గౌతంరెడ్డి మరణంతో ఓ స్థానం ఖాళీగా ఉంది. సీఎంజగన్ కాకుండా కేబినెట్‌లో 25 మంది మంత్రులకు చాన్స్ ఉంటుంది. గౌతంరెడ్డి లేకపోవడంతో...  మిగిలిన ఇరవై నాలుగు మంది మంత్రులు రాజీనామాలు చేశారు. వారి రాజీనామా పత్రాలు సీఎం జగన్ తీసుకున్నారు. అయితే కేబినెట్ సమావేశంలో మీలో ఐదారుగురు కొత్త కేబినెట్‌లో కూడా ఉంటారని సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడు వారెవరు అనేది చర్చనీయాంశంగా మారింది.  


ఆ ఐదుగురి అర్హత సమర్థతా? సామాజికవర్గమా ?


ఏపీ కేబినెట్‌లో ఐదారుగుర్ని కొనసాగించడం ఖాయమని తేలడంతో వారెవరు అన్నదానపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా విస్తృతంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. వివిధ సామాజికవర్గ సమీకరణాలు, అనుభవజ్ఞులు పేరుతో  ఐదుగురికి చాన్స్ ఉందని వైఎస్ఆర్‌సీపీలోనే ప్రచారం జరుగుతోంది. గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వంటి మంత్రులు సామాజికవర్గ సమీకరణాలతో... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సీనియర్ల కేటగిరిలో... ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమర్థత కోటాలో పొడిగింపు లభించవచ్చని భావిస్తున్నారు. అయితే వీరే్ అని ఎవరికీ తెలియకుండా సీఎం జగన్ వారి వద్ద కూడా రాజీనామా పత్రాలు తీసుకున్నారు. అందుకే అందరి వద్ద రాజీనామా లేఖలు తీసుకోవడంతో కొనసాగింపు పొందబోతున్న ఆ ఐదుగురు ఎవరు అన్న చర్చ నడుస్తోంది. 


రాజీనామా లే్ఖలు గవర్నర్‌కు పంపితే క్లారిటీ వచ్చే అవకాశం !


సీఎం జగన్ మంత్రివర్గంపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. తన ఎన్నికల టీంపై ఓ అవగాహనకు వచ్చారు. ఆ తర్వాతే మంత్రివర్గ ప్రక్షాళనకు ముహుర్తం ఖారారు చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఎవరెవర్ని కొనసాగించాలో కూడాఆయనకు క్లారిటీ ఉంటుంది. అయితేఈ విషయంపై ఆయన ముందుగానే అందరికీ తెలిసేలా చేయాలనుకుంటే వారి వద్ద నుంచి రాజీనామా లేఖలు తీసుకునే వారు కాదు. కానీ చివరి వరకూ సస్పెన్స్ కొనసాగించాలనుకుంటున్నారు. అందుకే రాజీనామా లేఖలు తీసుకున్నారు. వీటిని గవర్నర్ వద్దకు పంపాల్సి ఉంది. గవర్నర్ వద్దకు అందరి రాజీనామా లేఖలు పంపుతారా లేకపోతే.. ఇప్పటికే మంత్రులుగా ఉన్న వారివి తప్ప అందరివీ పంపుతారా అన్నది ఇప్పుడు సందేహం. అందరివి పంపితే మళ్లీ కొనసాగించాలనుకుంటున్న వారితో ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంటుంది. అలా రాజీనామాలు చేయించడం.. ఇలా ప్రమాణస్వీకారం చేయించడం ఎందుకన్న వాదన కూడా వస్తుంది.


ఆశల పల్లకీలో మంత్రులు !


రాజకీయాల్లో పదవి లేకుండా ఉండటం కష్టం. ఉన్న పదవి పోతుందంటే భరించడం ఇంకా కష్టం. ప్రస్తుతం తాజా మాజీ మంత్రులకు అలాంటి పరిస్థితే ఉంది. చాలా మంది ఎక్కడా అసంతృప్తి బయటపడకుండా చూసుకుంటున్నారు. సీఎంఇష్టం అంటున్నారు. మంత్రివర్గం ఎప్పుడూ సీఎం ఇష్టమే అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొంత మంది తమ కోరికను మాత్రం ఆపుకోలేకపోతున్నారు. నలుగురు మంత్రులతో తన చాంబర్‌లో ప్రత్యేక భేటీ నిర్వహించిన బొత్స సత్యనారాయణ.. దేవుడి దయ ఉంటే కేబినెట్‌లో ఉంటానని వ్యాఖ్యానించారు. ఇక్కడ కావాల్సింది జగన్ కరుణ అని బొత్సకు ముందే తెలుసు. అలాగే కొడాలి నాని కూడా తనకు చాన్సెస్ తక్కువ అన్నారు కానీ అస్సల్లేవనలేదు. అంటే..  ఆయన కూడా కొనసాగిస్తారనే ఆశలు పెట్టుకున్నారు.