ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి భేటీ చాలా ఆసక్తిగా సాగినట్టు తెలుస్తోంది. ఆఖరి సమావేశానికి మంత్రులు తమ రాజీనామా లేఖలతో వచ్చారు. వాళ్లందరికీ స్పెషల్ లంచ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంతా సరదాగా గడిపారు.
చాలా బాగా పని చేశారు
మంత్రి మండలి భేటీ ప్రారంభమైన తర్వాత జగన్ మాట్లాడుతూ నేతలకు హితబోధ చేశారు. మాజీలు అవుతున్నామనే భావన వద్దని సూచించారు. సుమారు వెయ్యి రోజులు అంతా కలిసి పని చేశామని మంచి పేరు తెచ్చుకున్నరని కితాబిచ్చారు జగన్.
జిల్లా బోర్డులు ఏర్పాటు
ప్రోటోకాల్ లేదన్న అసంతృప్తి వద్దన్న సీఎం.. అవసరమైతే జిల్లా డెవలప్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ప్రోటోకాల్ సమస్యే ఉత్పన్నం కాదన్నారు. మంత్రిపదవులు పోవడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. వారితో సీఎం జగన్ మాట్లాడి భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టార్గెట్ చంద్రబాబు
ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్లను పార్టీ కోసం వాడుకుంటామన్నారు సీఎం జగన్. పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మరోసారి పార్టీని గెలిపించే బాధ్యత వాళ్లకు అప్పగించారు. చంద్రబాబును మళ్లీ ఓడించాలని మాజీలకు టార్గెట్ ఫిక్స్ చేశారు. మరోసారి చంద్రబాబు ఓడిపోతే ఆయనకు రాజకీయ భవిష్యత్ ఉండదని అభిప్రాయపడ్డారు. మిగిలిన 700 రోజులు పార్టీ కోసం పని చేయాలని సూచించారు జగన్.
ఆ నలుగురు ఏం చర్చించారు
మంత్రివర్గం భేటీ తర్వాత బొత్స ఛాంబర్‌లో నలుగురు మంత్రులు స్పెషల్‌గా భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశానికి తానేటి వనిత, కన్నబాబు, అవంతి శ్రీనివాస్ హాజరయ్యారు. వాళ్లు ఏం చర్చించారు అనేది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మొత్తం 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సీఎం జగన్ కు లేఖలు అందజేశారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ చివరి సమావేశం ముగిసింది. ఈ భేటీలో 36 అంశాలపై కేబినెట్ చర్చించింది. ఈ సమావేశంలో మిల్లెట్ మిషన్ పాలసీ, డిగ్రీ కళాశాలల్లో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ వంటి తదితర ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చివరి కేబినెట్ భేటీలో కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదించింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి కేబినెట్ అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసింది. విజయ్‌కుమార్‌ను సీఎం జగన్ తో సహా కేబినెట్ మంత్రులు అభినందించారు. మంత్రుల్లో ఐదు, ఆరుగురికి తిరిగి అవకాశం లభించే అవకాశం ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు.
ఈ రాత్రికే రాజీనామాలు ఆమోదం
మంత్రులు రాజీనామా లేఖలను కాసేపట్లో జీఏడీ అధికారుల ద్వారా గవర్నర్ కార్యాలయానికి పంపనున్నారు. ఈ రాత్రికే రాజీనామాలు ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 10న కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు సీఎం జగన్ పంపనున్నారు. కేబినెట్ చివరి సమావేశం కావడంతో కీలక అంశాలను ఆమోదించారు.
రాజీనామా చేసిన మంత్రులు వీళ్లే
- కొడాలి నాని
- పేర్ని నాని
- ఆళ్ల నాని
- పుష్పశ్రీవాణి
- నారాయణ స్వామి
- సీదిరి అప్పలరాజు
- బొత్స సత్యనారాయణ
- ధర్మాన కృష్ణదాస్
- అవంతి శ్రీనివాస్
- కన్నబాబు
- వెల్లంపల్లి శ్రీనివాస్
- తానేటి వనిత
- మేకతోటి సుచరిత
- చెల్లుబోయిన గోపాల కృష్ణ
- రంగనాథ్ రాజు
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- ఆదిమూలపు సురేష్
- బాలినేని శ్రీనివాస్ రెడ్డి
- అనిల్ కుమార్ యాదవ్
- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- గుమ్మనూరు జయరాం
- అంజాద్ బాషా షేక్
- విశ్వరూప్ పినిపే
- శంకర్ నారాయణ