CM Chandrababu Visited Real Time Governance Center: రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్ట్ సిద్ధం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులకు సూచించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సెంటర్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం అక్కడే సీఎస్ (CS), డీజీపీ (DGP) సహా ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పౌర సేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడంపై కీలక సూచనలు చేశారు. రియల్ టైమ్‌లో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని అన్నారు.
అధికారులకు కీలక ఆదేశాలు
అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను యాక్సిస్ చేసుకుని సత్వర సేవలను అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆధార్, స్కూల్ అడ్మిషన్, వ్యాక్సినేషన్ డేటా, రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, మ్యారేజ్ సర్టిఫికెట్, ఇతర ధ్రువపత్రాలకు సంబంధించి కార్యక్రమాలు ప్రజలకు ఆటోమేటిక్‌గా అందే అంశంపై చర్చించారు. అలాగే, పారిశుద్ధ్యం, ప్రమాదాలు, ట్రాఫిక్, నేరాలు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, పంట కాలువల నిర్వహణ, వ్యవసాయం, భారీ వర్షాలు, వరదలు, విపత్తులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా తీసుకోదగిన చర్యలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వంటి వాటి ద్వారా డేటా విశ్లేషణ, ప్రభుత్వ సేవల అందజేత, నాణ్యత వంటి అంశాలు సైతం చర్చకు వచ్చాయి. పౌరులకు మెరుగైన సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు అధికారులు దిశానిర్దేశం చేశారు.
పీఎం మోదీకి సీఎం విషెష్
అటు, అమెరికా పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగివస్తున్న సందర్భంగా పీఎం మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని భారత్‌కు విచ్చేస్తోన్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం. ఆయనలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడి నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. మోదీ ప్రపంచంలో భారత్ స్థానాన్ని బలపరచడం సహా ప్రపంచ నాయకుడిగా ఎదిగారు. దేశాలు, జాతులను ఐక్యం చేయడంలో ఆయన కృషి ప్రశంసనీయం. ఐరాసలో ప్రధాని ప్రసంగం.. భవిష్యత్తులో ప్రపంచ వేదికపై మనం పోషించబోయే పాత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది.' అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read: Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం