CM Chandrababu Good News To Women Employees: రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగినులకు అవసరమైన ప్రతి చోటా వసతి గృహాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్ స్థాయిలో 100 వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు వివరించగా.. ఉద్యోగినుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైతే డివిజన్ స్థాయిలోనూ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, వసతి గృహాల చెంతనే పిల్లల సంరక్షణకు వీలుగా ప్రత్యేక కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. తొలుత ప్రభుత్వమే మహిళా వసతి గృహాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తుంది. అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కానీ.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కానీ వీటిని నిర్వహించనున్నారు. ఈ హాస్టల్స్‌పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం అధికారులకు నిర్దేశించారు.


అంగన్వాడీల అభివృద్ధిపై..


రాష్ట్రంలో అంగన్వాడీల అభివృద్ధిపైనా సీఎం అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఎన్నింటిని అదే స్థాయిలో ఉంచాలి.?. ఎన్నింటిని ఉన్నతీకరించాలనే దానిపై సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న చోట అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణకు ఏమాత్రం అవకాశం ఉన్నా చేపట్టాలని అన్నారు. అలాగే, దాతల అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసే 'మేము సైతం' కార్యక్రమాన్ని కూడా తిరిగి అమలు చేయాలని నిర్దేశించారు.


రాష్ట్రంలో 14,597 అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్, 8,455 కేంద్రాల్లో విద్యుత్ సదుపాయం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. రానున్న 3 నెలల అన్నీ అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల పనుల్ని పూర్తి చేయాలని నిర్దేశించారు. దీని కోసం కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని సూచించారు.


ధరల నియంత్రణపై..


రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునరుద్ధరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పని చేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రేషన్ దుకాణాల్లో బియ్యం, కందిపప్పు సహా మరిన్ని సరుకులు తక్కువ ధరకు అమ్మాలని సూచించారు. రానున్న రోజుల్లో రైతులకు ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అలాగే, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాలపై తగిన ప్రతిపాదనలతో రావాలని నిర్దేశించారు.


'వారి ఆర్థిక భద్రత మా బాధ్యత'


రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత తన భాద్యత అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లు తొలి రోజే 64 లక్షల మందికి ఇళ్ల వద్దే పంపిణీ చేయడం పూర్తి సంతృప్తి ఇచ్చిందని తెలిపారు. రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 97.54 శాతం మందికి పింఛన్లు అందించినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఒకటో తేదీనే అందించినట్లు వివరించారు.