Andhra Pradesh: ఊరిలో జాతరకు రావాలని ఆ చిన్నారికి పెద్దమ్మ కబురు పెట్టింది. ఎంతో సంబరంగా జాతరకు వెళ్ళింది. అలా ఆ జాతరకు వచ్చిన ఆ చిన్నారికి తెలియదు అదే తన చివరి ప్రయాణమని. ఇక తన వారిని చూసుకోలేనని. నాన్న తర్వాత చేయి పట్టి నడిపించాల్సిన పెదనాన్నే తన పాలిట యముడు అవుతాడని అనుకోలేదు. సత్యాసాయి జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా ఉండే ప్రజల కంట తడి పెట్టిస్తుంది. 


ఊరంతా జాతర సంబరంలో ఉండగా పెన్నా నది చూపిస్తానంటూ చిన్నారిని తీసుకెళ్లిన పెదనాన్న పాడు పని చేసి పాతిపెట్టాడు. హిందూపురం గ్రామీణ మండలంలో జరిగిన ఈ దుర్ఘటన తల్లిదండ్రుల్లో వణుకుపుట్టిస్తోంది. ఇంట్లోనే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని ఇక ఎవరు కాపాడుతారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంత చేసిన ఆ వ్యక్తి తనకేమీ తెలియదన్నట్టు ఎంచక్కా ఇంటికి వచ్చేశాడు. అప్పటికే బాలిక కనిపించడం లేదని బంధువులు ఆందోళన పడసాగారు. 


గ్రామదేవత ఉత్సవానికి రావలసిన ఒక మహిళ తన చెల్లెలి కుటుంబాన్ని ఆహ్వానించింది చెల్లెలు గర్భవతి కావడంతో రాలేనని తన భర్తను కుమార్తెను పంపించింది. జాతరకు వెళ్లిన వారు ఉదయం పెదనాన్న గంగాధర్ తన మరదలు కుమార్తెను పెన్నా నది ఒడ్డుకు తీసుకొని వెళ్ళాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న అతడు ఆ చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబుతుందని గ్రహించి చిన్నారిని హతమార్చాడు. నది ఒడ్డునే గొయ్యి తీసి పాతిపెట్టేశాడు. 


అప్పటికే బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది జాతరలో వెతకడం మొదలుపెట్టారు. ఎంత వెతికిన కనిపించకపోవడంతో ఆఖరిగా వారి పెదనాన్నతోనే వెళ్ళింది అని తెలుసుకున్న బంధువులు గంగాధర్‌ను గట్టిగా నిలదీశారు. దీంతో తాను చేసిన అఘాయిత్యాన్ని బంధువులకి వివరించాడు.


గంగాధర్ చెప్పిన విషయాలకు నిర్ధాంత పోయిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి నిందితున్ని అరెస్టు చేశారు.  నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే తాను చేసిన పనిని మొత్తం వివరించాడు. పాప మృతదేహాన్ని ఎక్కడ పూడ్చాడో ముందుగా చెప్పని గంగాధర్.. పోలీస్ స్టైల్‌లో విచారణ చేయడంతో అంతా కక్కేశాడు. 


పాపని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని చూపించాడు. ఆ గోతిలో నుంచి పాప మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తెలుసుకున్న చిన్నారి తండ్రి, కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీరు మున్నీరయ్యారు.