ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మొత్తం 25 మంది కొత్త మంత్రులను అక్షర క్రమం ప్రకారం (ఆల్ఫాబెటికల్ ఆర్డర్) ప్రమాణం చేయించారు. వీరిలో తొలుత అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు.
‘‘... అనే నేను శాసనం ద్వారా నిర్మితం అయిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని, భయం గానీ, పక్షపాతం కానీ, రాగ ద్వేషాలుగానీ లేకుండా, రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.’’
‘‘..అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, ఏ వ్యక్తికీ గానీ వ్యక్తులకు గానీ తెలియపర్చనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ కొత్త మంత్రులు ప్రమాణం చేసి సంతకాలు చేశారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి వరుస క్రమం ఇదీ..
* అంబటి రాంబాబు
వయసు: 65 ఏళ్లు
చదువు: బీఏ, బీఎల్
నియోజకవర్గం: సత్తెనపల్లి
నేపథ్యం: 1988లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు. 1989లో రేపల్లె నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 99ల్లో రెండుసార్లు ఓడారు. 1991 నుంచి 1994 వరకు నెడ్‌క్యాప్ ఛైర్మన్‌గా చేశారు. 2005 నుంచి 2007 వరకు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఉన్నారు. YSRCP పార్టీ పెట్టాక అందులో చేరారు. 2014లో సత్తెనపల్లి నుంచి ఓడిపోయినా 2019 ఎన్నికల్లో గెలిచారు.
* అంజద్ భాషా
నియోజకవర్గం: కడప
వయసు: 50
చదువు: డిగ్రీ (డిస్ కంటిన్యూ)
నేపథ్యం: 2005లో కడప మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచారు. వైఎస్ మరణం తర్వాత వారి కుటుంబానికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. 2014లో వైస్ఆర్ సీపీ తరఫున కడప ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జగన్ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు.
* ఆదిమూలపు సురేష్
నియోజకవర్గం: యర్రగొండపాలెం
వయసు: 58
చదువు: ఎంటెక్, పీహెచ్‌డీ
నేపథ్యం: రైల్వేలో ఉద్యోగం చేసి వీఆర్ఎస్ తీసుకున్నారు. 2009లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో సంతనూతలపాడు నుంచి వైసీపీ నుంచి గెలిచారు. 2019లో మళ్లీ యర్రగొండపాలెం నుంచి విజయం సాధించారు. గత కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రి అయ్యారు.
* బొత్స సత్యనారాయణ
నియోజకవర్గం: చీపురుపల్లి
వయసు: 64
చదువు: బీఏ
నేపథ్యం: కాంగ్రెస్ లో చాలా కాలం ఉన్నారు. 1992 నుంచి 1999 వరకు రెండుసార్లు విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా పని చేశారు. 1996లో బొబ్బిలి ఎంపీగా పోటీ చేసి ఓడారు. 1999లో అక్కడి నుంచే కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. 2004, 2009ల్లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఓడిపోయారు. 2019లో మళ్లీ గెలిచారు. 2012 నుంచి 2015 వరకు ఉమ్మడి ఏపీకి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి కేబినేట్‌లలో మంత్రిగా వ్యవహరించారు. జగన్ కేబినెట్‌లో రెండో సారి పదవి దక్కింది.
* బూడి ముత్యాల రాజు
నియోజకవర్గం: మాడుగుల
వయసు: 60
చదువు: ఇంటర్
నేపథ్యం: 1991లో వార్డు సభ్యుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత సర్పంచిగా, ఎంపీటీసీ సభ్యుడిగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాడుగుల నుంచి గెలిచి, శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడిగా వ్యవహరించారు. 2019లో రెండోసారి గెలిచి, ప్రభుత్వ విప్ పదవి చేపట్టారు.
* బుగ్గన రాజేంద్రనాథ్
నియోజకవర్గం: డోన్
వయసు: 52
చదువు: బీటెక్
నేపథ్యం: బుగ్గన 1995 నుంచి 2006 వరకు రెండుసార్లు సర్పంచిగా ఉన్నారు. టీడీపీలో ఉన్న బుగ్గన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో, తర్వాత వైసీపీలో చేరారు. 2014లో తొలిసారి డోన్ ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచి ఆర్థిక మంత్రి అయ్యారు.
* చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
నియోజకవర్గం: రామచంద్రపురం
వయసు: 60
విద్యార్హత: బీఎస్సీ
నేపథ్యం: కాంగ్రెస్ పార్టీ నుంచి 2001 నుంచి 2006 వరకు రాజోలు జడ్పీటీసీగా ఉన్నారు. తర్వాత అయిదేళ్లు తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2014లో కాకినాడ గ్రామీణ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడారు. 2019లో రామచంద్రాపురం నుంచి టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. 2020 జులైలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయ్యారు.
* దాడిశెట్టి రాజా
నియోజకవర్గం: తుని
వయసు: 45
చదువు: బీఏ
నేపథ్యం: 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2010లో వేసీపీలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్నారు. తాజాగా మంత్రి పదవి దక్కింది.
* ధర్మాన ప్రసాదరావు
నియోజకవర్గం: శ్రీకాకుళం
వయసు: 65
చదువు: ఇంటర్
నేపథ్యం: 1983లో స్వగ్రామంలో సర్పంచిగా ఎన్నికయ్యారు. 1987లో పోలాకి ఎంపీపీగా పనిచేశారు. 1989లో నరసన్నపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. 1991-94 కాలంలో చేనేత, జౌళిశాఖ, జలవనరులు, పోర్టులశాఖ మంత్రిగా చేశారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి కీలక మంత్రి పదవులు చేపట్టారు. 2014 ఎన్నికల్లో ఓడినా, 2019లో మళ్లీ గెలిచారు.
* గుడివాడ అమర్ నాథ్
నియోజకవర్గం: అనకాపల్లి
వయసు: 37
చదువు: బీటెక్
నేపథ్యం: 21 ఏళ్ల వయసులోనే 2007లో టీడీపీ నుంచి జీవీఎంసీ కార్పొరేటర్‌గా గెలిచారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అనకాపల్లి ఎంపీగా పోటీచేసి టీడీపీ ఎంపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు చేతిలో ఓడారు. అప్పటి నుంచి విశాఖపట్నం నగర, గ్రామీణ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
* గుమ్మనూరు జయరాం
నియోజకవర్గం: ఆలూరు
వయసు: 54
చదువు: ఎస్‌ఎస్‌ఎల్‌సీ
నేపథ్యం: 2005లో రాజకీయ ప్రవేశం. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. 2011లో వైసీపీలో చేరారు. 2014, 2019ల్లో ఆలూరు నుంచి రెండుసార్లు గెలిచారు. జగన్ తొలి కేబినెట్‌లో కార్మిక, ఉపాధి శిక్షణ మంత్రిగా పని చేశారు.
* జోగి రమేశ్
నియోజకవర్గం: పెడన
వయసు: 52
చదువు: బీఎస్సీ
నేపథ్యం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్‌గా, రైల్వేబోర్డు సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో తొలిసారిగా పెడన నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో మైలవరం నుంచి వైసీపీ నుంచి ఓడారు. 2019 ఎన్నికల్లో పెడన నుంచి మళ్లీ గెలిచారు.
* కాకాణి గోవర్థన్ రెడ్డి
నియోజకవర్గం: సర్వేపల్లి
వయస్సు: 58
చదువు: ఎంఏ, పీహెచ్‌డీ
నేపథ్యం: కాంట్రాక్టర్ అయిన గోవర్ధన్‌రెడ్డి తొలిసారిగా సైదాపురం నుంచి కాంగ్రెస్ తరఫున జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2006లో జడ్పీ ఛైర్మన్‌గా గెలిచారు. వైసీపీలో చేరి 2014, 2019ల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు.
* కారుమూరి వెంకట నాగేశ్వరరావు
నియోజకవర్గం: తణుకు
వయసు: 57
చదువు: పదో తరగతి
నేపథ్యం: 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి ద్వారకాతిరుమల జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జిల్లాపరిషత్ ఛైర్మన్ పదవి చేపట్టారు. 2009లో తణుకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి దెందులూరులో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ తణుకు నుంచి పోటీ చేసి గెలిచారు.
* కొట్టు సత్యనారాయణ
నియోజకవర్గం: తాడేపల్లి గూడెం
వయసు: 67
చదువు: ఇంటర్మీడియట్
నేపథ్యం: 1994లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. 1999లోనూ ఓడారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరినా సీటు రాకపోవడంతో వెంటనే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. తర్వాత వైసీపీలో చేరి 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
* కళత్తూరు నారాయణ స్వామి
నియోజకవర్గం: గంగాధరనెల్లూరు
వయసు: 73
చదువు: బీఎస్సీ
నేపథ్యం: 1983లో కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. 2004లో సత్యవేడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2009లో ఓడారు. తర్వాత వైసీపీ నుంచి 2014, 2019ల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీలతో గెలిచారు. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రి పదవి వచ్చింది.
* ఉషా శ్రీ చరణ్
నియోజకవర్గం: కళ్యాణదుర్గం
వయస్సు: 46
చదువు: ఎంఎస్సీ, పీహెచ్‌డీ
నేపథ్యం: ఉషశ్రీ కర్ణాటకకు చెందిన వారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో స్థిరపడ్డారు. 2012లో టీడీపలో చేరారు. 2013లో వైసీపీలో చేరి, కళ్యాణదుర్గం సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి గెలిచారు.
* మేరుగ నాగార్జున
వయసు: 58
నియోజకవర్గం: వేమూరు
చదువు: ఎం.కాం, ఎంఫిల్, పీహెచ్‌డీ
నేపథ్యం: విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేసేవారు. 2009లో వేమూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడారు. వైసీపీలో చేరి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2014లో వైసీపీ నుంచి మళ్లీ ఓడారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు.
* పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నియోజకవర్గం: పుంగనూరు
వయసు: 70
చదువు: ఎంఏ, పీహెచ్‌డీ
నేపథ్యం: 1974లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు. 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా, 1985, 94ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పీలేరు నుంచి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1989, 1999, 2004లో పీలేరు నుంచి, 2009లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరి 2014, 2019ల్లో పుంగనూరు నుంచి గెలిచారు. వైఎస్, రోశయ్య, జగన్ కేబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు.
* పినిపె విశ్వరూప్
నియోజకవర్గం: అమలాపురం
వయసు: 60
చదువు: బీఎస్సీ, బీఈడీ
నేపథ్యం: 1987లో కాంగ్రెస్‌లో చేరారు. ముమ్మిడివరం నుంచి 1998 ఉప ఎన్నిక, 1999 ఎన్నికల్లో పోటీచేసి ఓడారు. 2004లో ముమ్మిడివరం నుంచి, 2009లో అమలాపురం నుంచి గెలిచారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినేట్లలో పనిచేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మంత్రి పదవి వదులుకున్నారు. 2013లో వైసీపీలో చేరి, 2014 ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీచేసి ఓడారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.
* పీడిక రాజన్న దొర
నియోజకవర్గం: సాలూరు
వయసు: 58
చదువు: ఎంఏ
నేపథ్యం: 2004లో ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014, 19ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఒక్కసారి కూడా ఓడలేదు.
* ఆర్కే రోజా
నియోజకవర్గం: నగరి
వయసు: 51
చదువు: బీఎస్సీ డిస్ కంటిన్యూ
నేపథ్యం: డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా సినీరంగ ప్రవేశం చేశారు. 1999లో టీడీపీలో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడారు. వైసీపీలో చేరి, నగరి నుంచి 2014లో, 2019లో గెలుపొందారు. 2019 జులై నుంచి రెండేళ్ల నుంచి ఏపీఐఐసీ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. టీడీపీ, వైసీపీల్లో మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు.
* సీదిరి అప్పలరాజు
నియోజకవర్గం: పలాస
వయసు: 42
చదువు: ఎంబీబీఎస్
నేపథ్యం: 2017లో జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పలాసలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై గెలిచారు. మత్స్యకార వర్గానికి చెందిన ఈయనను జగన్ కేబినెట్‌లో చేర్చుకున్నారు. ఇప్పుడు మరోసారి మంత్రిగా కొనసాగించారు.
* తానేటి వనిత
నియోజకవర్గం: కొవ్వూరు
వయసు: 49
చదువు: ఎమ్మెస్సీ
నేపథ్యం: టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2013లో వైసీపీలో చేరారు. అప్పటి నుంచి కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఓడారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా చేశారు.
* విడదల రజిని
నియోజకవర్గం: చిలకలూరిపేట
వయసు: 31
చదువు: బీఎస్సీ, ఎంబీఏ
నేపథ్యం: రజిని మామ టీడీపీలో ఉన్నా ఆమె టీడీపీని వీడి 2018లో వైసీపీలో చేరారు. అక్కడ సీనియర్ వైసీపీ నాయకుడు మర్రి రాజశేఖర్‌ను కాదని 2019 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో పత్తిపాటి పుల్లారావుపై గెలిచారు.