Mekathoti sucharitha: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్ ఏర్పాటు పలువురిలో తీవ్రమైన అసహనానికి దారి తీసింది. కొత్తగా మంత్రి పదవి ఆశించి దక్కని వారు, ఉన్న పదవి కోల్పోయిన వారు పలువురు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి జగన్‌కు ఎదురు చెప్పని నేతలు తాజాగా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. ఇంకొందరు కన్నీరు పెట్టుకున్నారు. పదవి పోవడంతో మాజీ మంత్రి మేకతోటి సుచరిత తీవ్ర అసహన స్వరం వినిపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాత మంత్రులను కేబినెట్‌లో అలాగే ఉంచి తనకు ఒక్కరికే పదవి ఇవ్వకపోవడాన్ని ఆమె సీరియస్‌గా తీసుకున్నారు. 


దీంతో తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో పత్తిపాడు ఎమ్మెల్యే అయిన మేకతోటి సుచరిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి అన్నంతపనీ చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను ఎంపీ మోపిదేవి వెంకటరమణకు ఇచ్చారు. ఆయన ఆమెను పరామర్శించేందుకు వెళ్లగా రాజీనామా లేఖను ఆయనకు ఇచ్చారు. దీంతో మోపీదేవి బుజ్జగింపులు పని చేయలేదు. పాత మంత్రులు అందరినీ తీసేస్తామని తొలుత జగన్ చెప్పారని, అలా చేసి ఉంటే ఏ గోలా ఉండేది కాదని మేకతోటి అనుచరులు చెబుతున్నారు. అదీకాక ఆమె సామాజికవర్గానికి చెందిన నలుగురు పాత మంత్రుల్లో ముగ్గురిని అలాగే ఉంచి, మేకతోటి సుచరితను తప్పించి ఆమె స్థానాన్ని మేరుగు నాగార్జునకు ఇవ్వడం మరింతగా బాధించిందని చెప్పారు.


వైఎస్ కుటుంబానికి తాను విధేయురాలిగా ఉన్నానని, కష్ట సమయాల్లో పార్టీకి అండగా ఉన్నానని చెప్పారు. అనేక ఇబ్బందులకు గురైనా జగన్ వెంటే ఉన్నానని సుచరిత చెప్పారు. ఈ క్రమంలో ఆమె రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.


జగన్ మొదటి కేబినెట్ లో మేకతోటి సుచరిత హోం మంత్రిగా పని చేశారు. రెండోసారి కూడా తనకు మినిస్టర్ పదవి వస్తుందని ఆమె ఆశించారు. కానీ, ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో మనస్తాపం చెంది.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను నేరుగా స్పీకర్‌కి కాకుండా ఓ ఎంపీకి సమర్పించారంటే.. ఆమెకు నిజంగా ఎమ్మెల్యే పదవిని వదులుకోవడం ఇష్టం లేదనే వాదన వినిపిస్తోంది. కేవలం తన అసంతృప్తిని తెలుపుకోవడానికే పార్టీకి రాజీనామా లేఖను ఇచ్చారని అంటున్నారు.


ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రివర్గం
మరోవైపు, ఏపీలో కొత్త కేబినెట్ మరికొద్దిసేపట్లో కొలువుదీరనుంది. మొత్తం 25 మంది మంత్రులు నేడు ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని సచివాలయం పక్కన ఉన్న స్థలంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రుల పేర్లను ఖరారు చేసి ఆ లిస్టును ఇప్పటికే రాజ్ భవన్‌కు పంపించారు. అందుకు గవర్నర్ కూడా ఆమోదించారు. అయితే, ఎవరికి ఏఏ శాఖ అప్పగిస్తున్నారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. దీనిపై స్పష్టత నేడు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై సీఎం సజ్జలతో కలికే ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 


ఉత్కంఠకు తెరపడింది. కొత్త కేబినెట్ రూపుదిద్దకుంది. మూడు రోజులుగా మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణపై కసరత్తు చేసిన సీఎం జగన్‌.. ఆదివారం తుది జాబితాను ఖరారు చేశారు. 25 మందితో ఏపీ నూతన మంత్రివర్గం సోమవారం ఉదయం కొలువుదీరనుంది. ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న పార్కింగ్‌ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.