Kakani Govardhan Reddy inducted In AP Cabinet: నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీలో కొత్త కేబినెట్ చిచ్చు పెట్టింది. జిల్లాకి గతంలో రెండు మంత్రి పదవులుండగా.. ఈసారి కేవలం ఒకరికి మాత్రమే అవకాశం దక్కింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి జట్టులో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి జలవనరుల శాఖ ఇచ్చారు, దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డికి ఐటీ, పరిశ్రమల శాఖలు ఇచ్చారు. మంత్రి పదవిలో ఉండగానే మేకపాటి అకాల మరణం చెందారు. ఇక మలిజట్టులో అనిల్ కుమార్ యాదవ్ కి చోటు దక్కలేదు. ముందునుంచీ ఆయన దీనికి సిద్ధంగానే ఉన్నాారు. పదవుల ప్రకటన తర్వాత ఆయన ఎలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయలేదు. 


నెల్లూరు నుంచి కాకాణికి చోటు.. 
ఇక తాజా మంత్రి వర్గంలో నెల్లూరు జిల్లా తరపున సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. కాకాణిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి కాకాణి రమణారెడ్డి 18 ఏళ్లు పొదలకూరు సమితి అధ్యక్షుడిగా పని చేశారు. తల్లి లక్ష్మీకాంతమ్మ తోడేరు సర్పంచిగా 25 ఏళ్లు కొనసాగారు. కాంట్రాక్టర్ గా ఉన్న గోవర్ధన్‌ రెడ్డి తొలిసారిగా సైదాపురం నుంచి కాంగ్రెస్‌ తరఫున జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచే 2006లో జడ్పీ ఛైర్మన్‌ గా ఎన్నికయ్యారు. వైసీపీలో చేరి 2014, 2019ల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు జగన్. 


కాకాణి మంత్రి పదవి ముందునుంచీ ఊహించినదే. నెల్లరూలు జిల్లాకు తొలి దశలో ఇద్దరు యువకులకు చోటిచ్చారు జగన్, మలి విడతలో సీనియర్లకు అవకాశమిస్తారని, సామాజిక సమీకరణాల వల్ల జిల్లాలో ఓసీలకు దక్కే ఆ ఒకే ఒక్క సీటు కాకాణికి దక్కుతుందనే అంచనాలున్నాయి. ఆ అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయి. 


సర్దుకుపోయిన ఆనం.. 
జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కాల్సి ఉన్నా అది కుదరలేదు. జగన్ తొలి టీమ్ లోనే ఆనంకు పదవి వస్తుందని అనుకున్నారంతా. కానీ కాంగ్రెస్ నుంచి ఆనం టీడీపీలో చేరి,  ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. దీంతో ఆనంకు మంత్రి పదవి దక్కలేదు. కనీసం  రెండో విడతలో అయినా ఆయనకు పదవి వస్తుందనుకున్నా.. సామాజిక సమీకరణాల వల్ల అది కుదరలేదు. అయితే ఆనం మాత్రం ఎక్కడా బయటపడలేదు, సర్దుకుపోయారు. పైగా.. కాకాణికి మంత్రి పదవి రాగానే ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. పార్టీకి విధేయతతో ఉంటానని చెప్పకనే చెప్పారు. అంతా జగన్ అభీష్టం అనేశారు. 


కోటంరెడ్డి భావోద్వేగం.. 
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించినవారిలో ఉన్నారు. కానీ ఇక్కడ కూడా సామాజిక సమీకరణం ఆయనకు అవకాశం లేకుండా చేసింది. జిల్లాకే చెందిన రెడ్డి సామాజిక వర్గ నేత కాకాణికి బెర్త్ ఖాయం కాగా.. అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి అవకాశం లేకపోవడంతో కోటంరెడ్డి పేరు లిస్ట్ లో లేదు. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. నెల్లూరు కార్పొరేటర్లు సామూహిక రాజీనామా చేస్తామన్నారు. కానీ ఆయన వారించారు. ఓ దశలో కోటంరెడ్డి భావోద్వేగానికి గురై ఏడ్చేశారు. తాను జగనన్న సైనికుడినని, ఆయనవెంటే ఉంటానని చెప్పారు. పదవి రాకపోయినా పార్టీకి బద్ధుడిగా ఉంటానని, ముందే చెప్పినట్టు ఇంటింటికీ పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. మొత్తమ్మీద నెల్లూరు జిల్లాలో కొత్త కేబినెట్ సరికొత్త చర్చకు దారి తీసింది. ఓవైపు సంబరాలు, మరోవైపు నిరసనలు, భావోద్వేగాలు బహిర్గతం అయ్యాయి




Also Read: YSRCP Leaders Protest: ఏపీ కొత్త కేబినెట్ ఎఫెక్ట్ - సీఎం జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతల నుంచి నిరసనలు


Also Read: AP New Cabinet: ఏపీ కేబినెట్‌లో బీసీలకు పెద్దపీట - కమ్మ, వైశ్య, క్షత్రియులకు దక్కని ఛాన్స్