AP New Cabinet: ఇన్ని రోజులు జగనన్న తమకు న్యాయం చేస్తారని భావించిన నేతలు ఏపీలో కొత్త కేబినెట్ జాబితా బయటకు రాగానే భగ్గుమంటున్నారు. తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న నేతలు.. సజ్జల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో నేతల అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రోడ్లపై టైర్లు తగులబెడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చోడవరం నుండి ఒంగోలు వరకూ నిరసనలు పాకాయి. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత అయితే ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా చేయడానికి సైతం వెనుకాడటం లేదు. తమ అభిమాన నేతలకు కేబినెట్‌లో పదవి దక్కలేదని తెలియగానే వారి అభిమానులు సీఎం జగన్ (AP CM YS Jagan Mohan Reddy) ఫ్లెక్సీలు చింపేసి, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్నటివరకూ జగన్‌పై ఈగ కూడా వాలనివ్వని నేతలు ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన తమకు మంత్రిపదవుల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. మాజీ హెం మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
రోడ్డుపై టైర్లు కాల్చిన పిన్నెల్లి అభిమానులు
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని ఆయనతో పాటు స్థానిక పార్టీ శ్రేణులు భావించాయి. కానీ పిన్నెల్లికి కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో మాచర్ల నియోజక వర్గంలో ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపై టైర్లు కాలుస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఆ మంటల్లోకి దూకుతానంటూ ఓ మహిళ కార్యకర్త హడావుడి చేయడం సంచలనంగా మారింది. అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు ఆమెను అడ్డుకుని పక్కకు తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తీసుకెళ్ళిపోయారు . జగన్ తో మొదటి నుండీ వెన్నంటి ఉన్న పిన్నేల్లికి మంత్రిపదవి ఇవ్వకపోవడం అన్యాయం అంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు .
మేకతోటి సుచరిత రాజీనామా!
తనతో పనిచేసిన దళిత మంత్రులను అందరినీ కొనసాగిస్తూ తనను మాత్రం పక్కన బెట్టడంతో మేకతోటి సుచరిత తీవ్ర మనస్తాపం చెందారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. నేతలు వెంటనే రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ రాజీనామా లేఖను ఎంపీ మోపిదేవి వెంకట రమణకుకి సుచరిత ఇచ్చారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, తన తల్లికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పలేదని మేకతోటి సుచరిత కుమార్తె రిషిక ప్రశ్నించారు. ఆమె ఇంటికి భారీగా చేరుకున్న అభిమానులు సజ్జల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పాటు సీఎం జగన్ ఫ్లెక్సీలు చింపి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ మరోసారి తన కేబినెట్‌లో అయిదుగురు దళిత నేతలకు అవకాశం కల్పించారు. ఎస్సీల నుంచి తానేటి వనిత, పినిపే విశ్వరూప్, కె.నారాయణ స్వామి, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జునలకు కొత్త కేబినెట్లో చోటు దక్కింది. గత మంత్రివర్గంలో ఉన్న హోం మంత్రి మేకతోటి సుచరితను తప్పించి, ఆమె స్థానంలో మేరుగ నాగార్జునని కేబినెట్‌లోకి తీసుకున్నారు జగన్.
కన్నీటి పర్యంతం అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మంత్రి వర్గంలో చోటుదక్కకపోవడంతో వైసీపీలో అసమ్మతి స్వరాలు మొదలయ్యాయి. తన పేరును కనీసం పరిశీలించకపోవడంపై కోటంరెడ్డి శ్రీధర్‍రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఆశించడం తప్పా అని ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. కాకాణిని వైసీపీలోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వైసీపీలో ముందు నుంచి తనకు ప్రాధాన్యతలేదని కోటంరెట్టి అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించలేదని సన్నిహితుల ఆవేదన చెందారు. రేపటి నుంచి నియోజకవర్గంలో తలపెట్టిన గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేశారు.
బాలినేని, శిల్పా చక్రపాణి రెడ్డిలకు నిరాశే..
తమ అభిమాన నేతలకు మంత్రి పదవులు దక్కకపోవడంతో బాలినేని శ్రీనివాస రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులు నిరసన తెలిపారు. శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరుల్లో ఐదుగురు కౌన్సిలర్ లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. మంత్రి పదవి విషయంలో బాలినేని సైతం వెనక్కు తగ్గడం లేదని తెలుస్తోంది. తమ నేతకు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతుండగా.. బాలినేనికి మద్దతుగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సైతం వచ్చారు. కొత్త కేబినెట్లో చోటు దక్కకపోవడంతో బాలినేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని మద్దతుదారులు చెబుతున్నారు. బాలినేని అభిమానులు ఏకంగా సీఎం జగన్, వైఎస్సార్‌సీపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
జగ్గయ్యపేటలోనూ వైసీపీ కార్యకర్తలు ఫైర్
తమ అభిమాన నేత సామినేని ఉదయభానుకు మంత్రి వర్గంలో ఈసారి కూడా అవకాశం దక్కకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో రోడ్డుపై నిరసనలు వ్యక్తం చెయ్యడమే కాకుండా ఓ స్కూటర్ ను కూడా తగులబెట్టారు. మరికొన్ని చోట్ల పార్టీ ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలు దగ్దం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చోడవరంలో భగ్గుమన్న వైసీపీ కార్యకర్తలు..
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశీ అనుచరులు కూడా ఏపీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతకు మంత్రి పదవి దక్కకపోవడం తో రోడ్డుపై టైర్లు కాలుస్తూ నిరసనలు తెలియజేశారు. పార్టీ కోసం శ్రమించిన నేతలకు కేబినెట్లో పదవులు దక్కలేదని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో ఎప్పుడూ జగన్‌ను నిత్యం పొగుడుతూ ఉండే ధర్మశ్రీ అభిమానులు సైతం ఇలా చెయ్యడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది.
Also Read: AP New Cabinet: ఏపీ కేబినెట్‌లో బీసీలకు పెద్దపీట - కమ్మ, వైశ్య, క్షత్రియులకు దక్కని ఛాన్స్