AP New Cabinet Takes Oath Today: ఏపీలో కొత్త కేబినెట్ మరికొద్దిసేపట్లో కొలువుదీరనుంది. మొత్తం 25 మంది మంత్రులు నేడు ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని సచివాలయం పక్కన ఉన్న స్థలంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రుల పేర్లను ఖరారు చేసి ఆ లిస్టును ఇప్పటికే రాజ్ భవన్‌కు పంపించారు. అందుకు గవర్నర్ కూడా ఆమోదించారు. అయితే, ఎవరికి ఏఏ శాఖ అప్పగిస్తున్నారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. దీనిపై స్పష్టత నేడు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై సీఎం సజ్జలతో కలికే ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 


సామాజికవర్గాల ప్రాతిపదికే కీలకం
ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక సమతుల్యతను పాటిస్తున్నట్టు చెప్పారు. మంత్రివర్గ కూర్పులో సజ్జల కీలకంగా వ్యవహరించారనే చర్చ సాగుతోంది. గత మూడు రోజులుగా ఈ విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం పలు దఫాలుగా చర్చించారనే వార్తలు వచ్చాయి. ఆఖరి దశలో చివరి జాబితా తయారయ్యే వరకూ ఆయనే సీఎంకు అన్ని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.


తొలుత కేబినెట్ మొత్తం ప్రక్షాళన అని చెప్పిన జగన్ ప్రభుత్వం కొత్త కేబినెట్‌లో 11 మంది పాత మంత్రులకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, అంజాద్‌ బాషా, గుమ్మనూరు జయరామ్, బుగన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కె.నారాయణ స్వామిలకు మరోసారి అవకాశం వచ్చింది. చిత్తూరు నుంచి అత్యధికంగా ముగ్గురికి కొత్త మంత్రివరంలో చోటు లభించింది.


అసహనంలో పలువురు..
అయితే, పాత మంత్రులకు 11 మందికి అవకాశం ఇవ్వడంతో ఈసారి అవకాశం దక్కని వారు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో మేకతోటి సుచరిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ మంత్రులందరినీ కొనసాగిస్తూ తనను తప్పించడానికి తాను చేసిన తప్పు ఏంటని ఆవేదన చెందారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాకు మేకతోటి సిద్ధపడినట్లు సమాచారం. ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. 


మంత్రి పదవులు కోల్పోయినవారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. మొత్తంగా కేబినెట్ కూర్పులో సజ్జల పాత్ర కీలకంగా మారిందని సమాచారం.