AP Cabinet Decisions : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సుమారు రెండున్నక గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే పీఆర్సీ జీవోలో మార్పులకు అంగీకారం తెలిపింది. ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదలకు ఆమోదముద్ర వేసింది. అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో అమలు కానున్న నాలుగు సంక్షేమ పథకాలు విద్యాకానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహనమిత్ర పథకాలకు కేబినెట్ అంగీకారం తెలిపింది. వంశధార నిర్వాసితులకు రూ.216 కోట్ల పరిహారం విడుదల చేయాలని ఈ భేటీలో కేబినెట్ నిర్ణయించింది. 







మంత్రి వర్గ భేటీలో మొత్తం 42 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధుల విడుదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.15 వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 


మంత్రి వర్గ భేటీలో కీలక నిర్ణయాలు 


ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల చేసిందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో రూ.15 వేల కోట్లతో అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు ఆమోదించింది. జులైలో అమలు చేసే జగనన్న విద్య కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులలో 3,530 ఉద్యోగాలు భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేవాలయాల కౌలు భూముల పరిరక్షణ చర్యలకు అంగీకారం తెలిపింది. 


మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు 


ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. 'ఈ ఏడాది అమ్మ ఒడి పథకం అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈసారి 43 లక్షల 96 వేల 402 మంది తల్లుల ఖాతాలకు రూ.6594 కోట్లు జమ చేయనున్నాం. బైజూస్ తో ఒప్పందం మేరకు 4.7 లక్షల మంది 8 తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. 2025 నాటికి అంతా సీబీఎస్ఈ సిలబస్ ద్వారా ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2022-23 జులైలో నెలలో అమలు చేసే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా కానుక, వాహన మిత్ర, కాపునేస్తం, జగనన్న తోడు పథకాల అమలుకు ఆమోదం. పథకాల అమలులో సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నాం. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.216 కోట్ల పరిహారం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. ఏపీఎస్ఆర్టీసీ నుంచి పీటీడీకి వచ్చిన ఉద్యోగుల పీఆర్సీతో పాటు పీఆర్సీలో మార్పు చేర్పులు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్చర్ జ్యోతిసురేఖకు డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇచ్చేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టే ప్రతిపాదనకూ కేబినెట్ తీర్మానం చేసింది.'  అని మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ తెలిపారు.  


వైద్య కళాశాలల్లో 3530 పోస్టుల మంజూరు 


"విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల వైద్య కళాశాలల్లో 3,530 పోస్టుల మంజూరుకు ఆమోదం. 10 ఎకరాలకు కలిగి ఉన్న ఆక్వా రైతులకూ విద్యుత్ సబ్సిడీ అందించేందుకు ఆమోదం. డిస్కమ్ లు రూ.500 కోట్ల రూపాయల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం. 3700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ఎంఐజీ ల నిర్మాణానికి ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి కేబినెట్ తీర్మానం చేసింది. 40 శాతం మేర ప్రైవేటు వారికి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. 13 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీ చైర్మన్లనే 26 జిల్లాలకూ కొనసాగిస్తూ పంచాయతీ రాజ్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ కు 3148 ఎకరాల భూమిని ప్రభుత్వ ఈక్విటీగా పరిగణించేలా కేబినెట్ తీర్మానం చేసింది. రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.  తిరుపతిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో విన్ టెక్ మొబైల్ సంస్థకు 75 ఎకరాల భూమి కేటాయింపుపై నిర్ణయం తీసుకుంది."  


రాజ్ భవన్ లో 100 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ 


"డిసిప్లనరీ ప్రోసీడింగ్స్  ట్రైబ్యునల్ రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. 789 కేసులను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది.  రాజ్ భవన్ లో 100 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిత్లీ తుపాను  అదనపు ఇన్ పుట్ సబ్సిడీ రూ.182 కోట్లు ఇచ్చేందుకు ఆమోదించింది. కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేస్తూ జారీ చేసిన గెజిట్ కు ఆమోదించింది. తుది నోటిఫికేషన్ల జారీకి మంత్రివర్గం తీర్మానం చేసింది. గండికోటలో ఇంటిగ్రేటెడ్ టూరిజం  ప్రాజెక్టు కోసం పర్యాటక శాఖకు 1131 ఎకరాలు కేటాయించింది. ఏపీ రైట్స్ ల్యాండ్ రైట్స్ పట్టాదార్ ల్యాండ్ యాక్ట్  చట్ట సవరణ డ్రాఫ్ట్ బిల్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సర్వారాయ సాగర్ ప్రాజెక్టుకు నర్రెడ్డి శివరామారెడ్డి రిజర్వాయర్  పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదించింది." అని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. 


Also Read : Ysrcp Support Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికే వైసీపీ మద్దతు, నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్న ఎంపీ విజయసాయిరెడ్డి


Also Read : Vijayasai Reddy: విశాఖ విషయంలో మళ్లీ ఆ ప్రకటన, ఇన్నాళ్లకి! విజయసాయి సీఎంకి తెలిసే చేశారా?