Ysrcp Support Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ వెంట నడిచేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన దిల్లీ వెళ్లి స్వయంగా ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని వార్తలు కూడా వచ్చాయి. కానీ సీఎం దిల్లీ పర్యటన రద్దైంది. వైసీపీ తరఫున ఎంపీలు విజయసాయి రెడ్డి, పీవీ మిథున్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం దక్కడం శుభపరిణామమని వైసీపీ పేర్కొంది. గడిచిన మూడేళ్లుగా సామాజిక న్యాయానికి ఏపీ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపింది. ఈ క్రమంలోనే ద్రౌపది ముర్ముకే తమ మద్దతు ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర కేబినెట్ భేటీ కారణంగా శుక్రవారం జరిగే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కాలేకపోతున్నారని ప్రకటించింది. అయితే పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి హాజరవుతారని వైసీపీ వెల్లడించింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.
ఎవరీ ద్రౌపది ముర్ము?
64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యాం చరణ్ ముర్ము. మర్ము దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా కాలేజీ నుంచి బీఏ చదివారు. ఆ తర్వాత టీచర్ గా తన కేరీర్ ను ఆమె ప్రారంభించారు. 197-83 మధ్య ఒడిశాలోని నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా, 1994 నుంచి 97 వరకూ శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్ లో అసిస్టెంట్ టీచర్ గా పని చేశారు. 1997లో ఆమె రాజకీయ ప్రవేశం చేశారు.
2015లో గవర్నర్
1997 ఏడాదిలో బీజేపీ లో చేరిన ద్రౌపది ముర్ము అదే ఏడాదిలో కౌన్సిలర్ అయ్యారు. తర్వాత 2000వ ఏడాదిలో రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ టర్మ్ లోనే ఆమెను మంత్రి పదవి వరించింది. 2000 - 02 వరకూ ఒడిశాలో రవాణా, వాణిజ్య మంత్రి అయ్యారు. బిజు జనతాదళ్ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఆమె పని చేశారు. 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 2004లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో 2002 నుంచి 2009 వరకూ మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2006 నుంచి 2009 వరకూ ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగానూ ఉన్నారు. 2010లో మళ్లీ మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలు అయ్యారు. మళ్లీ 2013 నుంచి 2015 వరకూ మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు. 2015లో ఝార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా ఎంపికయ్యారు. ద్రౌపది ముర్ము తన భర్త, ఇద్దరు కుమారులను ఓ ప్రమాదంలో కోల్పోయారు.